సర్పంచ్ పదవికి వేలంపాట… ₹73 లక్షలకు బంగారిగడ్డలో ఏకగ్రీవం

జ్ఞాన తెలంగాణ, నల్గొండ :
నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు అసాధారణ మలుపు తిరిగాయి. సర్పంచ్ పదవికి మొత్తం 11 మంది నామినేషన్లు సమర్పించగా, గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం కోసం ఏకగ్రీవం మంచిదని గ్రామ పెద్దలు, రాజకీయ కార్యకర్తలు చర్చించి నిర్ణయించారు. అనంతరం సర్పంచ్ పదవిని వేలంపాట విధానంలో నిర్ణయించేందుకు గ్రామ సమితి ముందుకు వచ్చింది.
ఈ వేలంపాటలో మహమ్మద్ సమీనా ఖాసీం అతి పెద్ద మొత్తం అయిన ₹73 లక్షలు ప్రకటించడంతో సర్పంచ్ పదవి ఆమెకు దక్కింది. మిగతా 10 మంది అభ్యర్థులు గ్రామ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఏకగ్రీవ నిర్ణయానికి అంగీకరించడమే కాకుండా, అధికారికంగా నామినేషన్ విత్‌డ్రా చేసుకుంటామని ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దీంతో బంగారిగడ్డ పంచాయతీ పూర్తిగా ఏకగ్రీవంగా మారింది. అధికారులు త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. గ్రామ అభ్యున్నతికి భారీ మొత్తాన్ని సమర్పించేందుకు ముందుకు వచ్చిన అభ్యర్థిపై గ్రామస్తులలో చర్చ నడుస్తోంది.
