కోకాపేటలో క్యాపిటల్‌ విజన్‌ చెరిపేస్తారా?

– ఖజానా కోసం లేఅవుట్‌ను పాతరపెడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం

– ఖజానా ఖాళీ… ప్రజా ప్రయోజనాలు బలి


జ్ఞానతెలంగాణ,డెస్క్ :

రాష్ట్ర ఖజానా ఖాళీ కావడంతో ప్రభుత్వం తాత్కాలిక ఆదాయాల కోసం పరితపిస్తోంది. దీని ఫలితంగా ప్రజా ప్రయోజనాలను పక్కనబెట్టి భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకుంటోందన్న విమర్శలు పెరుగుతున్నాయి. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, అంతర్జాతీయ మౌలిక వసతుల ప్రమాణాలతో రూపకల్పన చేసిన కోకాపేట నియోపోలిస్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం ఒక సాధారణ ఆదాయ వనరుగా చూస్తోందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

నియోపోలిస్‌—హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టిన ప్రాజెక్టు

భవిష్యత్తు దృష్టితో నిర్మించిన బహుముఖ లేఅవుట్‌ :

కోకాపేట నియోపోలిస్‌ ప్రాజెక్టు హైదరాబాద్‌ నగర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి చేసిన ప్రణాళిక. వందల ఎకరాల పరిధిలో మల్టీ యూజ్‌—వాణిజ్య, వినోద, రవాణా, పబ్లిక్‌ యుటిలిటీ—అన్నీ సమగ్రంగా కలిపిన అరుదైన లేఅవుట్‌. అధికారులు అత్యంత జాగ్రత్తగా రూపొందించిన ప్లాన్లు, అధునాతన రహదారులు, భారీ భవనాలకు అనువైన మౌలిక సౌకర్యాలు హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌కు కొత్త ప్రమాణాలు ఏర్పరిచాయి.

ముంబై తర్వాత అత్యంత ఖరీదైన భూముల జాబితాలో కోకాపేట:

ఐటీ కారిడార్‌కు సమీపంలో ఉండడం, అంతర్జాతీయ ప్రమాణాల మౌలిక వసతులు, పెద్ద పరిశ్రమలకు అనువైన లాజిస్టిక్‌ సదుపాయాల కారణంగా కోకాపేటలో ఎకరం 100 కోట్లకు అమ్ముడైన భూములు ఉన్నాయి. దేశంలో ముంబై తర్వాత అత్యంత విలువైన లేఅవుట్‌గా కోకాపేట నిలబడింది. ఈ ప్రాజెక్టు తనంతట తాను పెట్టుబడులను ఆకర్షించడమే కాదు—హైదరాబాద్‌ గ్లోబల్ సిటీల రేసులో ముందుకు రావడానికి క్యాపిటల్‌ క్యాటలిస్ట్‌గా పనిచేసింది.

కాంగ్రెస్‌ ప్రభుత్వం—అభివృద్ధిని కాదు, అమ్మకాలనే చూస్తోందా?

ఖజానా కోసం లేఅవుట్‌ గుండెను కోస్తున్న మార్పులు:

గతంలో రూపొందించిన మల్టీపుల్‌ యూజ్‌ జోన్‌ను కాంగ్రెస్‌ ప్రభుత్వం హఠాత్తుగా మార్చేసింది. జోన్‌ మార్పు ద్వారా కన్వెన్షన్‌ సెంటర్లు, హోటళ్లు, మెట్రో మల్టీ లెవెల్‌ పార్కింగ్, మల్టీమోడల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ హబ్‌లకు కేటాయించిన ప్రాంతాన్ని ఇప్పుడు చిన్న చిన్న ప్లాట్లుగా విడదీసి అమ్మకానికి సిద్ధం చేసింది.
ఈ 41.21 ఎకరాల విలువైన భూమి—ఒకప్పుడు భవిష్యత్తు అభివృద్ధికి కేటాయించిన ప్రైమ్‌ జోన్—ఇప్పుడు ప్రభుత్వ ఖజానా నింపే గల్లాపెట్టెలా మారిపోయింది.

సంవత్సరం కూడా పూర్తికాక ముందే ప్లాన్ల మార్చివేత:

గతంలో రూపొందించిన లేఅవుట్‌ కేవలం ఏడాది కూడా పూర్తి కాక ముందే హెచ్‌ఎండీఏ అధికారికంగానే సెక్టార్‌-3లో భారీ మార్పులు చేసింది. దీంతో ముందుచూపు లేకుండా ప్రస్తుత అవసరాలకే పరిమితమయ్యే విధానంతో ముందుకెళ్తోందన్న విమర్శ లేచింది. భవిష్యత్తు నగర అభివృద్ధికి కావాల్సిన పబ్లిక్‌ యుటిలిటీ స్థలాలు పూర్తిగా తగ్గిపోతాయని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.

నిబంధనలు పక్కనపెట్టి—‘వేలం కోసం ఏదైనా’ ధోరణి

మల్టీపుల్‌ జోన్‌ భావనను పూర్తిగా దెబ్బతీస్తున్న మార్పులు:

మల్టీపుల్‌ జోన్‌ భూముల్లో గృహ అవసరాల‌తోపాటు వాణిజ్య, సేవా రంగాల‌కు అనువైన నిర్మాణాలను అనుమతించే నిబంధనలు ఉన్నాయి. ఇది నగర భవిష్యత్తు మౌలిక వసతులను రక్షించే వ్యవస్థ.
కానీ ప్రభుత్వం ఈ నిబంధనలను పట్టించుకోకపోవడం వల్ల పూర్వ ప్రణాళిక పూర్తిగా దెబ్బతింటోంది.

2. “నిబంధనలు అతిక్రమించలేదు” అంటున్న హెచ్‌ఎండీఏ – కానీ నిజం ఏమిటి?

హెచ్‌ఎండీఏ “ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా లేఅవుట్‌ మార్చడం మా హక్కు” అని చెప్పుకుంటోంది.
అయితే నిపుణులు మాత్రం వేరే అభిప్రాయం చెబుతున్నారు
“ఇది భవిష్యత్తు నగర ప్రణాళికను బలి చేసి తాత్కాలిక ఆదాయం కోసం తీసుకుంటున్న ప్రమాదకరమైన నిర్ణయం.”

You may also like...

Translate »