ఉక్రెయిన్‌తో యుద్ధం..

ఉక్రెయిన్‌తో భీకర యుద్ధం చేస్తున్న రష్యా సైన్యంలో పలువురు భారతీయులు పనిచేస్తున్నారన్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పష్టతనిచ్చింది. మొత్తం 44 మంది భారతీయ పౌరులు రష్యా సైన్యంలో ఉన్నట్లు శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించింది. వారిని వీలైనంత త్వరగా సైనిక సేవల నుంచి విడుదల చేయాలని రష్యా ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించింది.
విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఢిల్లీలో మీడియా సమావేశంలో ఈ వివరాలను తెలిపారు. “రష్యా సైన్యంలో 44 మంది భారతీయులు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. వారిని సైన్యం నుంచి వీలైనంత త్వరగా డిశ్చార్జ్ చేయాలని మాస్కోలోని భారత రాయబార కార్యాలయం ద్వారా రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నాం” అని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన భారతీయులకు కీలకమైన విజ్ఞప్తి చేశారు. “ప్రాణాంతకమైన, అత్యంత ప్రమాదకరమైన ఇలాంటి సైనిక ఉద్యోగాల్లో చేరవద్దని భారత పౌరులందరినీ కోరుతున్నాం. ఉపాధి కోసం అప్రమత్తంగా ఉండాలి” అని జైశ్వాల్ సూచించారు. యుద్ధ వాతావరణంలో చిక్కుకున్న భారతీయుల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని ఆయన భరోసా ఇచ్చారు.
