తెలంగాణను వణికిస్తున్న చలి..

- తెలంగాణలో పడిపోనున్న రాత్రి ఉష్ణోగ్రతలు
- మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
- రేపటి నుంచి గణనీయంగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు
- కనిష్ఠంగా 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు తెరపడింది. ఇకపై రాష్ట్ర ప్రజలను చలి వణికించనుంది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శనివారం వెల్లడించింది. రాబోయే రోజుల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 12 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉండనుంది. ఈ ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం ప్రారంభమైంది. శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలలో అత్యల్పంగా 14.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. శనివారం రాత్రి నుంచే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా, రేపటి నుంచి చలి ప్రభావం మరింత స్పష్టంగా కనిపించనుందని వాతావరణ శాఖ వివరించింది.
