మతంపై ఆసక్తి తగ్గుదల? సర్వేలో వెల్లడి!
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మత విశ్వాసాలు తగ్గుముఖం

జ్ఞానతెలంగాణ,సెంట్రల్ బ్యూరో :
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో మతం, దేవుడిపై నమ్మకం ఉన్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతోందా? అవుననే అంటున్నాయి తాజా సర్వే ఫలితాలు. ప్రముఖ డేటా సంస్థ ‘స్టాటిస్టా’ నిర్వహించిన గ్లోబల్ కన్స్యూమర్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 32 దేశాల్లో 18 నుంచి 64 ఏళ్ల మధ్య వయసు వారిపై జరిపిన ఈ సర్వేలో.. అనేక దేశాల్లో మత విశ్వాసాలు లేనివారు, నాస్తికుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం ప్రపంచానికి పూర్తి భిన్నంగా నిలిచింది.
సర్వే వివరాల ప్రకారం ప్రపంచంలో అత్యధికంగా దేవుడిపై నమ్మకం లేనివారు, నాస్తికులు చైనాలో ఉన్నట్లు స్పష్టమైంది. ఇక ఐరోపా దేశాల విషయానికొస్తే, యునైటెడ్ కింగ్‌డమ్‌లో (యూకే) సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు (దాదాపు 40 శాతం) తమకు మత విశ్వాసాలు లేవని లేదా తాము నాస్తికులమని స్పష్టం చేశారు. మతపరమైన సంప్రదాయాలకు పెట్టింది పేరైన ఇటలీలోనూ ఇప్పుడు పాతిక శాతానికి పైగా (26 శాతం) ప్రజలు మతానికి దూరంగా ఉంటున్నట్లు ఈ సర్వే వెల్లడించింది.
అయితే, భారతదేశంలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. ఇక్కడ మత విశ్వాసాలు లేనివారు లేదా నాస్తికులు అనే మాటకే తావు లేనట్లుగా సర్వే ఫలితాలు తేల్చి చెప్పాయి. సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో కేవలం 2 శాతం మంది మాత్రమే తమకు దేవుడిపై నమ్మకం లేదని పేర్కొన్నారు. మిగిలిన 98 శాతం మంది ఏదో ఒక మతాన్ని, దైవాన్ని విశ్వసిస్తున్నవారే కావడం గమనార్హం.
ఈ సర్వే ఫలితాలు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న సామాజిక, సాంస్కృతిక ధోరణులను ప్రతిబింబిస్తున్నాయి. పలు దేశాలు లౌకికవాదం వైపు అడుగులు వేస్తుండగా, భారతదేశంలో మాత్రం మత విశ్వాసాలు ఇప్పటికీ ప్రజల జీవితంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టమవుతోంది.
