డ్రగ్, గన్ కల్చర్‌కు కేటీఆరే మూలం: మంత్రి తుమ్మల విమర్శలు

- రేవంత్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఆగలేదు
- పారిశ్రామికవేత్తల వలసలు అవాస్తవం
జ్ఞాన తెలంగాణ,హైదరాబాద్,డెస్క్ :
రాష్ట్రంలో పెరిగిన డ్రగ్, గన్ కల్చర్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌నే ప్రధాన కారణమని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటుగా విమర్శించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన తీవ్ర స్థాయిలో కేటీఆర్‌పై దాడి చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ద కాలం పాలించినప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంపై లక్షల కోట్ల అప్పులు మోపి ప్రజల భవిష్యత్తును భారంలోకి నెట్టిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేస్తున్న “బాకీ కార్డు” ప్రచారం అసంబద్ధమని తుమ్మల నిలదీశారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో గత 20 నెలలుగా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయని తుమ్మల ప్రశంసించారు. రేవంత్ పాలనలో ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఆగలేదని, ప్రజా నిధులను పారదర్శకంగా వినియోగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
కేటీఆర్ చేసిన “పారిశ్రామికవేత్తలు తెలంగాణను వదిలి వెళ్తున్నారు” అన్న వ్యాఖ్యలను తుమ్మల ఖండించారు. ఇది పూర్తిగా అవాస్తవమని, ప్రతి రోజూ కొత్త పెట్టుబడులతో పారిశ్రామికవేత్తలు తెలంగాణకు వస్తున్నారని వివరించారు. “తెలంగాణలో పెట్టుబడుల వాతావరణం బలంగా ఉంది. పారిశ్రామికవేత్తలు రేవంత్ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు” అని తుమ్మల స్పష్టం చేశారు.
ఇటీవలి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలను గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నేతలకు తుమ్మల హితవు పలికారు. “పదిేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేతలకు ప్రజల తీర్పు చక్కగా తెలిసింది. అలాంటి వారికి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శించే నైతిక హక్కే లేదు” అని వ్యాఖ్యానించారు. తుమ్మల నాగేశ్వరరావు చేసిన ఈ వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
