కేటీఆర్‌పై మంత్రి జూపల్లి ఫైర్‌ దమ్ముంటే కేటీఆర్‌ చర్చకు రావాలని సవాల్

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్ డెస్క్ :

తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయి. రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పుల బారిన పడిందని, ఒక్కొక్కరిపై రూ.4 లక్షల భారాన్ని మోపారని ఆయన ఆరోపించారు. “పది ఏళ్ల పాటు బుల్డోజర్‌ పాలన చేసింది బీఆర్‌ఎస్సే. ప్రజలను అణగదొక్కిన, అధికారులను బెదిరించిన పాలన బీఆర్‌ఎస్స‌దే. రౌడీరాజ్యం మాది కాదు, వాళ్లదే” అని మండిపడ్డారు.

జూపల్లి మాట్లాడుతూ, “నేను మంత్రిగా నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ప్రజలకు చేసిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాను. అయితే, బీఆర్‌ఎస్‌ నేతలు నాపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారు” అని అన్నారు.

ఫేక్‌ సర్వేలు విడుదల చేసి ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించిన జూపల్లి, “కేటీఆర్‌కు నా గురించి మాట్లాడే అర్హతే లేదు. అతను నిజాయితీగా ఉంటే చర్చకు రావాలి. కావాలంటే పబ్లిక్‌గా కూడా చర్చించడానికి సిద్ధం” అని సవాల్‌ విసిరారు.బీఆర్‌ఎస్‌ పాలనలో నిధుల దుర్వినియోగం, ప్రాజెక్టుల అవకతవకలు, ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రం వెనుకబడి ఉందని జూపల్లి ఘాటుగా విమర్శించారు. ప్రజలు నిజాన్ని గుర్తించి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మరింత బలమివ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

You may also like...

Translate »