చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అనంతగిరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు

– ప్రజల అభ్యున్నతి, రాష్ట్ర శ్రేయస్సు కోసం దేవుని ప్రార్థన


జ్ఞానతెలంగాణప్రతినిధి,వికారాబాద్ :

వికారాబాద్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనంతగిరి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా చేవెళ్ల శాసనసభ్యుడు కాలే యాదయ్య భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన శ్రీ అనంత పద్మనాభ స్వామి, బుగ్గ రామలింగేశ్వర స్వామి, ఎల్లకొండ పార్వతీ–పరమేశ్వర స్వామి దేవాలయాలను దర్శించి, పుష్పార్చన, అభిషేకం, హారతులు సమర్పించారు.

కార్తీక పౌర్ణమి పర్వదినం పవిత్రమైనదని పేర్కొంటూ, ప్రజలందరి జీవితాల్లో సుఖశాంతులు నిండాలని, రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని దేవునిని ప్రార్థించారు. తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు ఐక్యతతో, సౌభ్రాతృత్వంతో, సంతోషసమృద్ధులతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజల సంక్షేమమే తన లక్ష్యమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను అందిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అనంతగిరి కొండల సుందర సోయగాల మధ్య పూజలు నిర్వహించిన ఎమ్మెల్యేను భక్తులు, స్థానిక ప్రజలు ఆత్మీయంగా ఆహ్వానించారు. ఆయనతో ఫోటోలు దిగుతూ, తమ సమస్యలను వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నానని యాదయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలు, దేవస్థానం అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You may also like...

Translate »