బాబా ఫసీయుద్దీన్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి : బీఆర్ఎస్ నాయకులు

జ్ఞాన తెలంగాణ | హైదరాబాద్ | నవంబర్ 1, 2025
బాబా ఫసీయుద్దీన్ వేధింపుల కారణంగా సర్దార్ అనే వ్యక్తి బిల్డింగ్ మూడో అంతస్తు నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటన జరిగి ఐదు నెలలు గడిచినా, ఇప్పటివరకు పోలీసులు విచారణను పూర్తి చేయకపోవడం పట్ల కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు మరియు కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు రికార్డు చేసినప్పటికీ నిందితుడు ఇప్పటివరకు అరెస్ట్ కాలేదని వారు తెలిపారు.
బాబా ఫసీయుద్దీన్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క, ఎంపీ మల్లు రవి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లతో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఒత్తిడి తెస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. కాంగ్రెస్ మీటింగ్‌లకు రాకపోతే “సర్దార్‌కు జరిగిన పరిస్థితి మీకు కూడా వస్తుంది” అంటూ ప్రజలను బెదిరిస్తున్నారని వారు పేర్కొన్నారు. అంతేకాక, “నా మీద ఎన్ని కేసులు పెట్టినా నన్ను ఎవ్వరూ ఏం చేయలేరు” అంటూ బాబా ఫసీయుద్దీన్ బహిరంగంగా మాట్లాడుతున్నారని అన్నారు.
ఫోన్‌లో బెదిరింపులు ఉన్న రికార్డింగ్‌లు ఉన్నప్పటికీ, ఐదు నెలలుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. 83 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని విమర్శించారు. పైగా నిందితుడికి ప్రభుత్వం గన్‌మెన్‌లను కేటాయించడం దారుణమని పేర్కొన్నారు.
బాబా ఫసీయుద్దీన్ ఆగడాలు దారుణంగా మారాయని, బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరకపోతే వేధింపులకు గురవుతున్నారని వారు తెలిపారు. గంజాయి పెట్టి అక్రమ కేసులు వేస్తామని, రైతుల కోసం సోషల్ మీడియాలో ట్వీట్ చేసినా కేసులు పెడతామని బెదిరింపులు చేస్తున్నారని వారు తెలిపారు. బోరబండలో ఎన్నికలు సజావుగా జరగాలంటే బాబా ఫసీయుద్దీన్‌ను వెంటనే అరెస్ట్ చేసి, రౌడీషీట్ ఓపెన్ చేసి, పీడీ యాక్ట్ కింద జైలుకు పంపాలని వారు డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మరియు స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సర్దార్ కుటుంబ సభ్యులతో కలిసి బోరబండ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్‌ను కలసి నిందితునిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, బాబా ఫసీయుద్దీన్‌కు గన్‌మెన్‌లను ఇచ్చిన అంశంపై ఎన్నికల కమిషన్ మరియు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను కూడా కలవనున్నట్లు తెలిపారు.


