ఎస్‌బీఐలో ఉద్యోగాల జాతర..

  • మూడు దశల పరీక్షల ద్వారా అభ్యర్థుల ఎంపిక  
  • ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం 18,000 పోస్టుల భర్తీ లక్ష్యం

జ్ఞానతెలంగాణ,హైదరాబాద్,అక్టోబరు 27:

దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. తమ వ్యాపార కార్యకలాపాలు, ఖాతాదారుల సేవలను మరింత విస్తరించే లక్ష్యంతో భారీగా ఉద్యోగ నియామకాలకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఐదు నెలల్లో కొత్తగా 3,500 ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో) పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.
ఈ నియామక ప్రక్రియపై ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ (హెచ్ఆర్) కిశోర్ కుమార్ పోలుదాసు వివరాలు వెల్లడించారు. మొత్తం మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు ఆయన తెలిపారు. కాగా, ఈ ఏడాది జూన్ నాటికే 505 పీవో పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసినట్లు ఆయన గుర్తుచేశారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్యాంకు అవసరాల మేరకు ఆఫీసర్లు, క్లరికల్ కేడర్‌లలో కలిపి మొత్తం 18,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రణాళికలో భాగంగానే తాజా పీవో నియామకాలు జరుగుతున్నాయి.
మరోవైపు, మారుతున్న సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఐటీ, సైబర్ సెక్యూరిటీ విభాగాలను బలోపేతం చేయడంపై కూడా ఎస్‌బీఐ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే 1,300 మంది నిపుణులను నియమించుకుంది. తాజా నియామకాలతో బ్యాంకు సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

You may also like...

Translate »