బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా : బీఆర్ఎస్ నేతలు

తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోందని బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బంద్‌కు మద్దతు తెలుపుతూ బస్ భవన్‌కు బయలుదేరే ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పెద్ద డ్రామా ఆడుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై ఎలాంటి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. హైకోర్టు ఇచ్చిన స్టేతో బీసీలపై కాంగ్రెస్ పార్టీ వైఖరి బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిందని ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన మోసపూరిత విధానాలతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ దక్కకుండా పోయిందన్నారు.కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలను మభ్యపెట్టారని చూశారని.. కానీ బీసీలు వాస్తవాలను తెలుసుకున్నారని చెప్పారు. బీసీల రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేయడం దారుణమని పేర్కొన్నారు. చెల్లని జీవోలను, ఆర్డినెన్స్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో సమస్యలు పరిష్కరించే నాధుడే కరువయ్యాడని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తున్నాయని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్ బూటకం అని ఫైర్ అయ్యారు.మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ‘బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ పాల్గొంటున్నాయి. మొక్కుబడిగా బీసీ బంద్‌లో కాంగ్రెస్, బీజేపీ భాగస్వామ్యం కావొద్దు. బీసీలకు రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం రిజర్వేషన్లు వస్తాయి. బీసీ రిజర్వేషన్లు తగ్గిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. బీసీలకు ఒక్క శాతం రిజర్వేషన్ తగ్గవద్దు’ అని హెచ్చరించారు

You may also like...

Translate »