మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ 57వ వర్థంతి

మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ – బాబాసాహెబ్ అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు.

భారత రాజ్యాంగ రూపకల్పనలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కీలక పాత్ర పోషించగలిగేలా చేసిన మహానుభావుల్లో అగ్రగణ్యుడు మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్. ఆయన లేకపోతే బహుశా అంబేడ్కర్ గారు రాజ్యాంగ సభకు ఎన్నికయ్యేవారు కాదు. ఫలితంగా, భారత రాజ్యాంగాన్ని రచించే అవకాశమే లేకుండా పోయేదని చరిత్రకారులు అంగీకరిస్తారు.

డా.అంబేడ్కర్ పై కుట్రలు – మండల్ చేసిన యజ్ఞం.

1946 ఎన్నికల్లో కాంగ్రెసు హిందూ నాయకులు, కమ్యూనిస్టు నేతలు డాంగే నాయకత్వంలో అంబేడ్కర్‌ను ఓడించడానికి తీవ్ర కుట్రలు పన్నారు. విద్య లేకపోయినా ఒక సాధారణ అభ్యర్థిని అంబేడ్కర్‌పై పోటీకి పెట్టి, అంబేడ్కర్‌ను ఘోరంగా ఓడించారు. ఈ సమయంలో బెంగాల్ నుండి గెలిచిన జోగేంద్ర నాధ్ మండల్ తన హృదయపూర్వకమైన కృతజ్ఞత, సామాజిక స్పృహతో ముందుకు వచ్చి : “మా నాయకుణ్ణి రాజ్యాంగ సభకు ఎన్నిక కాకుండా ఎవరూ ఆపలేరు” అంటూ గట్టి సవాల్ విసిరారు.తన సొంత జైసోర్ నియోజకవర్గం నుండి పోటీ చేయకుండా విరమించి, అక్కడి నుండి అంబేడ్కర్‌ను గెలిపించి రాజ్యాంగ సభకు పంపించడం ద్వారా మండల్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు.

నామశూద్రుల గర్వకారణం.

జోగేంద్ర నాధ్ మండల్ 1904 జనవరి 29న ఈరోజు బంగ్లాదేశ్‌లో ఉన్న బెంగాల్ రాష్ట్రంలో నామశూద్ర కుటుంబంలో జన్మించారు. నామశూద్రులు భారతదేశంలో అతిపెద్ద “అంటరాని కులం”. వారు రైతులు, నేతలు, శ్రమజీవులు. కానీ ఆ సమాజం ఐక్యంగా నిలబడి అంబేడ్కర్‌ను రాజ్యాంగ సభకు పంపించడం ద్వారా కోట్లాది భారతీయుల భవిష్యత్తు మార్చారు.వారు మద్యం, డబ్బు, వంచనలకు లోబడకపోయి ఉంటే నేడు మనం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం గల రాజ్యాంగంలో జీవించడం సాధ్యమయ్యేది కాదు.

మండల్ రాజకీయ జీవితం.

1937లో బెంగాల్ శాసనసభకు ఎన్నికై సహకార రుణాల మంత్రిగా పనిచేశారు. బాబాసాహెబ్ స్థాపించిన ఆల్ ఇండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్‌లో సక్రియ పాత్ర పోషించారు. ముస్లిం లీగ్‌తో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకుని, షెడ్యూల్డ్ కులాలు మరియు ముస్లింల మధ్య ఉన్న సామాజిక-ఆర్థిక సారూప్యతను గుర్తించారు. 1946లో మధ్యంతర ప్రభుత్వంలో ముస్లిం లీగ్ సభ్యునిగా ప్రవేశించారు.

పాకిస్తాన్ తొలి న్యాయశాఖ మంత్రి

దేశ విభజన తర్వాత జోగేంద్ర నాధ్ మండల్ పాకిస్తాన్‌కు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ పాకిస్తాన్ తొలి కార్మిక మరియు న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. జిన్నా పట్ల ఆయనకు ఉన్న విశ్వాసం వల్ల పాకిస్తాన్ తొలి గవర్నర్ జనరల్ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహించారు.అయితే జిన్నా మరణానంతరం ముస్లిం మెజారిటీ బ్యూరోక్రసీ వలన షెడ్యూల్డ్ కులాలు అణచివేతకు గురయ్యారు. చివరకు 1950లో మండల్ భారతదేశానికి తిరిగి వచ్చారు.

చివరి దశలో కూడా ప్రజాసేవే.

ఇండియాలో ఆయనను రాజకీయ అంటరానివారిగా చూడడం జరిగింది. అయినప్పటికీ తన కృషిని ఆపకుండా, పశ్చిమ బెంగాల్‌లోకి వచ్చిన శరణార్థులకు పునరావాసం కల్పించడానికి కష్టపడ్డారు. 1968 అక్టోబర్ 5న మహాప్రాణ్ జోగేంద్ర నాధ్ మండల్ తన చివరి శ్వాస విడిచారు.

మండల్ వారసత్వం.

జోగేంద్ర నాధ్ మండల్ కేవలం ఒక నాయకుడు కాదు, అంబేడ్కర్ వెనుక నిలిచిన మహా యోధుడు. ఆయన పోరాటం వల్లే అంబేడ్కర్ రాజ్యాంగ సభలో ప్రవేశించారు. అందువల్ల భారత రాజ్యాంగ పుట్టుకలో మండల్ పాత్ర అమూల్యం.

అరియ నాగసేన బోధి
M.A., M.Phil., TPT., LL.B


You may also like...

Translate »