బాబోయ్.. మళ్లీ వానలు..

- బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!
తెలుగు రాష్ట్రాల్లో కొద్దిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ప్రజలు ఎడతెరిపిలేని వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో వచ్చే రెండు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.మహారాష్ట్ర పరిసరాల్లో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది నేడు అల్పపీడనంగా బలహీన పడనుంది. తరువాత పశ్చిమంగా మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా కదులుతూ.. అక్టోబర్ 1వ తేదీ నాటికి అరేబియా సముద్రంలోకి ప్రవేశిస్తుందని భారత వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.ఇదిలాఉంటే.. మంగళవారం అండమాన్ పరిసరాల్లో బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది అక్టోబర్ 1వ తేదీ నాటికి ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే రెండుమూడు రోజులు మోస్తరు నుంచి, తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తెలంగాణ జిల్లాలు నాగర్ కర్నూల్, నల్గొండ, గద్వాల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్ నగర్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మధ్యాహ్నం తరువాత నుంచి సాయంత్రం, రాత్రి సమయాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.అదేవిధంగా అదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని.. ఇక హైదరాబాద్ నగరంలో సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో వర్షం కురిసే చాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.