కడమంచి వారి విద్య కుసుమం – ఆడపిల్లల చదువు వెలిగించిన దీపం

కడమంచి వారి విద్య కుసుమం – ఆడపిల్లల చదువు వెలిగించిన దీపం



జ్ఞాన తెలంగాణ,శంకర్ పల్లి:
“విద్యే ఒక మనిషి భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి. ఆ శక్తి ఆడపిల్లల్లో వికసిస్తే అది కుటుంబానికే కాక, సమాజానికీ వెలుగునిస్తుంది” అన్న సత్యాన్ని రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన కడమంచి రాజేశ్వరి మరోసారి నిరూపించింది.

ఉస్మానియా విశ్వవిద్యాలయం పీజీ చివరి సంవత్సరం ఫలితాలలో రాజేశ్వరి 9.5 శాతం మార్కులు సాధించింది. ఈ ఫలితం ఆమె కృషి, తల్లిదండ్రుల ప్రోత్సాహం, కుటుంబం చూపిన విశ్వాసానికి నిదర్శనం.

తండ్రి కడమంచి ముకుందం గర్వంగా చెబుతూ –
“ఆడపిల్లలు చదివితేనే అసలైన సమాజం ముందుకు వెళ్తుంది. చదువుతో వారు తమ భవిష్యత్తును మాత్రమే కాదు, తమ కుటుంబం, సమాజాన్ని కూడా వెలిగిస్తారు. మా రాజేశ్వరి సాధించిన ఈ విజయం అందరికీ స్ఫూర్తినిస్తుంది. నా బిడ్డను ఆశీర్వదించమని అందరిని కోరుకుంటున్నానని అన్నారు.

ముకుందం హైదరాబాద్‌లో ఎం.వి. ఫౌండేషన్‌లో పనిచేస్తూ, పేద పిల్లల చదువు కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. తన కూతురు విజయం, ఆడపిల్లల విద్య విలువను సమాజానికి గుర్తు చేస్తోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.

రాజేశ్వరి సాధించిన ఈ విజయంతో చందిప్ప గ్రామం గర్వపడుతోంది. చిన్నారుల విద్య కుసుమాలు వికసించేలా ప్రతి కుటుంబం ఆడపిల్లలకు చదువు అవకాశాలు కల్పిస్తే, మన సమాజం మరింత వెలుగొందుతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు.

You may also like...

Translate »