పెన్షన్ హక్కు.. టెన్షన్ భవిష్యత్

  • 2004 తర్వాతి ఉద్యోగుల ఆర్థిక భరోసా ప్రశ్నార్థకం
  • కాంగ్రెస్ హామీ అమలుపై ఉద్యోగుల నిరీక్షణ

ప్రభుత్వ ఉద్యోగం అంటేనే భద్రత, భరోసా. ఆ ఉద్యోగి మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా జీవితాంతం ఆర్థిక, సామాజిక రక్షణతో సుఖంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. “పెన్షన్ లేని టెన్షన్ జీవితం” నేటి ప్రభుత్వ ఉద్యోగి ఎదుర్కొంటున్న నిజం అని చెబుతున్నారు రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లికి చెందిన సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలు శ్రీమతి వాణి సక్కుబాయి

“ఇప్పుడెవరైనా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాను అని అంటే వెంటనే సహజంగా వచ్చే ప్రశ్న ‘నీకు పెన్షన్ ఉందా?’ అన్నదే. దీనికి కారణం 2004 సెప్టెంబర్ 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త పెన్షన్ పద్ధతి – సహకార విధానం. 2004 తర్వాత నియమించబడిన ఉద్యోగులు, ఉపాధ్యాయులందరూ ఈ విధానంలోకి వస్తారు. ఇందులో ప్రతి నెలా ఉద్యోగి తన మూలవేతనం, జీవన వ్యయ భత్యం (డిఏ)లో పది శాతం కోతపెట్టి జాతీయ పెన్షన్ నిధిలో జమ చేస్తారు. ఉద్యోగ విరమణ సమయంలో ఆ మొత్తంలో సగం ఉద్యోగికి ఇస్తారు. మిగిలిన మొత్తాన్ని వాటాల మార్కెట్లో పెట్టుబడి పెట్టి, దాని లాభాల ఆధారంగా నెలనెలా పెన్షన్ ఇస్తారు. అంటే పెన్షన్ మొత్తం వాటాల మార్కెట్ లాభనష్టాలపై ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా ఎంత వస్తుందో ముందే చెప్పలేని పరిస్థితి. అదే పాత పెన్షన్ విధానంలో ఉండే పదవీ విరమణ మొత్తం (గ్రాట్యుటీ), సెలవు నగదు చెల్లింపు వంటి ప్రయోజనాలు ఈ కొత్త విధానంలో లేవు” అని సక్కుబాయి వివరిస్తున్నారు.

ఆమె మరింతగా చెబుతూ… “పలువురు ఉద్యమాల తరువాత తెలంగాణ ప్రభుత్వం 2021 జూన్ 11న జారీ చేసిన జీవో నంబరు 58 ప్రకారం, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు అలాగే వైద్య కారణాల వలన సేవ చేయలేని ఉద్యోగులకు కుటుంబ పెన్షన్ సదుపాయం కల్పించింది. అంతకు ముందు ఈ సౌకర్యం కొత్త పెన్షన్ పద్ధతిలో లేదు. పాత పెన్షన్ విధానం జీవితకాలం పెన్షన్ కల్పించేది. జీవన వ్యయ భత్యం ప్రతి పెన్షన్ మొత్తానికి జతచేసి ఇస్తారు. పదవీ విరమణ తర్వాత కూడా ఆరోగ్య భద్రత అందిస్తుంది. కానీ కొత్త విధానంలో ఇవి లేవు. ఆరోగ్య భద్రత కూడా కేవలం డెబ్బై ఏళ్ల వయసు వరకు మాత్రమే ఉంటుంది” అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న విధానాల గురించీ సక్కుబాయి ప్రస్తావించారు. “మొదటిది నిర్వచిత లాభాల పద్ధతి – 82 దేశాలు అమలు చేస్తున్నాయి. రెండవది నిర్వచిత సొమ్ము చెల్లింపు పద్ధతి – 46 దేశాలు అమలు చేస్తున్నాయి. మన దేశంలో 2004 జనవరి 1 నుండి జాతీయ పెన్షన్ విధానం పేరుతో ఈ కొత్త విధానం ప్రారంభమైంది. కేంద్రం, రాష్ట్రాలు దాన్ని అనుసరించాయి. 1982లో సుప్రీంకోర్టు పెన్షన్ అనేది ఉద్యోగి నిజాయితీగా చేసిన సేవలకు బహుమతి కాదు, అది ఒక హక్కు, వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించేది, ప్రభుత్వ దయపై ఆధారపడి ఉండేది కాదని తీర్పు ఇచ్చింది” అని గుర్తుచేశారు.

“ఇప్పటికీ ఇరవై ఏళ్లుగా ఈ కొత్త పెన్షన్ విధానానికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. దేశంలో పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, తమిళనాడు, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానం కొనసాగుతోంది. మరికొన్ని రాష్ట్రాలు కొత్త విధానాన్ని రద్దు చేసే దిశగా కమిటీలు ఏర్పాటు చేశాయి. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీగా కొత్త విధానం రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోవాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆత్మగౌరవ సభలు, నిరసనల ద్వారా మరోసారి గుర్తు చేస్తున్నారని వాణి సక్కుబాయి పేర్కొన్నారు.

You may also like...

Translate »