సురవరం సుధాకర్ రెడ్డి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు : సీఎం రేవంత్ రెడ్డి

భారత కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకుడు, లోక్‌సభ మాజీ సభ్యుడు, కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచి వామపక్ష భావజాలం కలిగిన సురవరం గారు చివరి వరకు నమ్మిన సిద్ధాంతం కోసం అవిశ్రాంత పోరాటం చేశారని గుర్తుచేసుకున్నారు.
విద్యార్థి దశ నుంచే అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారని, దేశ రాజకీయాల్లో ముఖ్యంగా వామపక్ష రాజకీయాల్లో వారు క్రీయాశీలక పాత్ర పోషించారని, వారి మరణంతో దేశం ఒక గొప్ప ప్రజాస్వామిక వాదిని కోల్పోయిందని పేర్కొన్నారు. నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎన్నికైన సురవరం గారు ప్రజా సమస్యల విషయంలో నిరంతరం ముందుండి పోరాటం చేశారని అన్నారు.
సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. సురవరం గారి కుటుంబ సభ్యులు, అభిమానులకు ముఖ్యమంత్రి గారు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
