సామాజిక న్యాయం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకం

  • జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

జ్ఞాన తెలంగాణ, భూపాలపల్లి, ఆగస్టు 18.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఐడిఓసి కార్యాలయంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజబాబు, అధికారులు, గౌడ సంఘం నాయకులు పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ –
దోపిడి వ్యవస్థకు ఎదురు తిరిగి పోరాడిన గొప్ప యుద్ధ వీరుడని కొనియాడారు.
17వ శతాబ్దంలోనే భూస్వాముల పెత్తందారితనానికి వ్యతిరేకంగా బహుజన ఉద్యమాన్ని నడిపిన విప్లవకారుడని తెలిపారు. గౌడ కుటుంబంలో పుట్టి 12 మంది స్నేహితులతో సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఆ సైన్యాన్ని 12 వేల మందికి పెంచి గోల్కొండ కోటపై యుద్ధం చేసి జెండా ఎగరేసిన ధైర్యవంతుడని అన్నారు.ప్రజల్లో సమానత్వం, ధైర్యం, దేశభక్తిని పెంపొందించేలా కృషి చేసిన పాపన్న జీవితాన్ని నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. నిజాం పాలకులకు, భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడి బహుజనుల అభ్యున్నతికి కృషి చేశారని గుర్తుచేశారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా ప్రభుత్వం నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.తరువాత కేక్ కట్ చేసి సర్వాయి పాపన్న గౌడ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, బీసీ సంక్షేమ అధికారి క్రాంతి కిరణ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షులు పభాకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు గాజర్ల అశోక్, గౌడ వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »