సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి

సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయండి

– ప్రమాదం జరిగి నెల రోజులు

– మృతదేహాలు ఇవ్వకపోవడం

– ఎక్స్ గ్రేషియా,డెత్ సర్టిఫికెట్లు అందకపోవడం పై మండిపాటు

సీఎం ప్రకటించిన కోటి రూపాయలు ఏమయ్యాయి

– అంతిమ సంస్కారాలు జరిపేందుకు శవాలు కూడా ఇవ్వని దుస్థితి

– వెంటనే ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్



జ్ఞానతెలంగాణ,సంగారెడ్డి :

పాశమైలారం సిగాచి కంపెనీ బాధితులకు వెంటనే న్యాయం చేయాలనీ, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులతో కలసి కలెక్టరేట్‌ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి, అదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు విలేకరులతో మాట్లాడుతూ.. సిగాచి కంపెనీలో ప్రమాదం జరిగి నెల రోజులు అయినా.. మృతదేహాలు ఇవ్వకపోవడం, ఎక్స్ గ్రేషియా, డెత్ సర్టిఫికెట్లు అందకపోవడం ఏమిటని ప్రశ్నించారు. సీఎం కోటి రూపాయల పరిహారం ప్రకటించినా, ఒక్కరికి కూడా ఇవ్వలేదనీ, అంతిమ సంస్కారాలు జరిపేందుకు శవాలు ఇవ్వని దుస్థితి నెలకొన్నదని తెలిపారు. బూడిదను గోదావరిలో కలిపామని కుటుంబాలు రోదిస్తున్నాయనీ, ఏపీ, బీహార్, యూపీ, జార్ఖండ్ వలస కార్మికుల శవాలను నూనె డబ్బాల్లో పంపించిన తీరును ఏమిటని ప్రశ్నించారు. మృతులకు కోటి, తీవ్రంగా గాయపడినవారికి 50 లక్షలు, స్వల్పంగా గాయపడినవారికి 25 లక్షల పరిహారం వెంటనే ఇవ్వాలనీ పేర్కొన్నారు. అదేవిధంగా డెత్ సర్టిఫికెట్, పంచనామా, ఎఫ్‌ఐఆర్ కాపీలను ఒక్క ఫోల్డర్‌లో అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన యాజమాన్యంపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనీ, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే 54 మంది చనిపోయారనీ, ఇప్పటికైనా సీఎం కళ్లతెరుచుకొని బాధితులకు న్యాయం చేయాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, మాణిక్ రావు, సునీత రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »