పాఠశాలపై అమితమైన ప్రేమ – 25 ఏళ్లుగా సేవలతో కృతజ్ఞతల పతాకం
ప్రైమరీకి రూ.25 వేలూ – హై స్కూల్కు రూ.50 వేలూ: మౌలిక వసతుల కోసం ప్రత్యేక సహాయం
ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులకు కూడా రూ.10,000 నగదు బహుమతుల హామీ
తల్లిదండ్రుల హర్షం – గ్రామీణ విద్యకు ఊతమిచ్చే అరుదైన నాయకుడికి అభినందనలు
జ్ఞాన తెలంగాణ, శంకర్పల్లి: 2024–25 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ప్రొద్దుటూరు గ్రామ పాఠశాల విద్యార్థులను ప్రోత్సహిస్తూ, ప్రతీ ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా శంకర్పల్లి మాజీ వైస్ ఎంపీపీ బొల్లారం ప్రవళిక వెంకట్ రెడ్డి రూ.10,000 చొప్పున నగదు బహుమతులు అందజేశారు. పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన తొమ్మిది మంది విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాన్ని అందించడం ద్వారా ఆయన విద్యాభివృద్ధిలో తన పాత్రను మరింత బలోపేతం చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షులు బొల్లారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ – “నేను చదువుకున్న పాఠశాలకు సేవ చేయడం నా జీవితంలో ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించాలనే సంకల్పంతో ఈ బహుమతులు అందిస్తున్నాను. విద్యార్థుల కోరిక మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పై చదువులకు వెళ్లడం కోసం ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున నగదు బహుమతులు అందిస్తానని హామీ ఇచ్చారు.
అంతేకాక, ప్రాథమిక పాఠశాలకు రూ.25,000, హై స్కూల్కు రూ.50,000 నగదు ను ప్రకటించారు. ఈ నిధులను పాఠశాల మౌలిక వసతుల అభివృద్ధికి వినియోగించాలని ప్రధానోపాధ్యాయులను కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.., ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం తన స్వంత ఖర్చులతో ఎల్లప్పుడు ముందుకు వస్తున్న బొల్లారం వెంకట్ రెడ్డి పట్ల మేము కృతజ్ఞతతో ఉన్నాము. ఈ నగదు బహుమతులు మా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాయి. భవిష్యత్తుపై వారి ఆశలను బలపరచాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ సుధాకర్ రెడ్డి, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ ఏనుగు లక్ష్మి, మాజీ చైర్మన్లు నాని రత్నం, నక్క అమర్, విద్యా కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.