స్థానిక సంస్థల ఎన్నికలకు వారంలో నోటిఫికేషన్ వస్తుందని తాను చెప్పలేదని మంత్రి సీతక్క స్పష్టత ఇచ్చారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడుంటాయో వారంలో స్పష్టత వస్తుందని అన్నానని అన్నారు. కేబినెట్లో నిర్ణయం జరగకుండా నేనెలా చెబుతానని వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులు బహిరంగంగా ప్రకటన చేయడంపై ఇవాళ టీపీసీసీ అధ్యక్షుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ… స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు స్పష్టత వస్తుందని భావిస్తున్నానని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం, పార్టీ కట్టుబడి ఉంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై ఎలా ముందుకెళ్లాలో ఇవాళ స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
జైలుకు వెళ్లాలనే కుతూహలం కేటీఆర్కు ఉంది : కవిత జైలుకు వెళ్లి రాగానే లిక్కర్ కేసుపై దృష్టి మళ్లించేందుకు బీసీలు, మహిళలు, దళితులపై ప్రేమ ఒలకబోస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కూడా సానుభూతి కోసమో, రెచ్చగొట్టడానికే జైలుకు వెళ్లాలని భావిస్తున్నట్లున్నారని అన్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వెళుతోంది ఎలాంటి కక్షలు లేవన్నారు. కక్ష సాధింపే అయితే ప్రభుత్వం రాగానే జైళ్లలో వేసే వాళ్లం కదా అని ప్రశ్నించారు. కక్షలు, కార్పణ్యాలు బీఆర్ఎస్ వాళ్లకే ఉంటాయని ధ్వజమెత్తారు. రేవంత్ పౌరుషంతో మాట్లాడితే కేటీఆర్ పొగరుతో మాట్లాడుతున్నారని మంత్రి సీతక్క ఆగ్రహించారు. జైలుకు వెళ్లాలనే కుతూహలం కేటీఆర్కే ఉన్నట్లు ఉందన్నారు