మూడు పెళ్లిళ్లు.. సనాతన ధర్మమా?

- ముందుగా జైల్లో పెట్టాల్సింది పవన్ కల్యాణ్‌నే
- రేవంత్ హామీలను అమలు చేయాల్సిందే: నారాయణ
జ్ఞాన తెలంగాణ,ఎల్బీనగర్ : సనాతన ధర్మాన్ని విమర్శించిన వాళ్లను జైల్లో పెట్టాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పదే పదే అంటున్నారని, మూడు పెళ్లిళ్లు చేసుకోవడం సనాతన ధర్మమా.. అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రశ్నించారు. సనాతన ధర్మంలో విడాకులు ఉండవని చెప్పారు. ఎప్పుడూ సనాతనం గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ ముగ్గురు భార్యలను ఎందుకు మార్చారని నిలదీశారు. పవన్ చెప్పేదాన్ని బట్టి మొట్టమొదట జైల్లో పెట్టాల్సింది ఆయననే అని ఎద్దేవా చేశారు. సనాతన ధర్మంలో సతీసహగమనం ఉందని, దాన్ని ఒప్పుకొంటారా అని నిలదీశారు. భారత సాంస్కృతిక సహకార స్నేహ సంఘం(ఇస్కఫ్) రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకల్లో నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తల తాకట్టు పెట్టి అయినా సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయాల్సిందేనన్నారు. లేకపోతే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని హెచ్చరించారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని, అందుకే ఆయన్ను ప్రజలు అధికారం నుంచి దూరం చేశారన్నారు. ఇప్పుడు ఆయన కూతురు కవిత బయటకొచ్చి వేరే కుంపటి పెట్టిందన్నారు. బీఆర్‌ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ చేయకూడదని హితవు పలికారు. తెలంగాణ ఏర్పడి 11 సంవత్సరాలు గడిచినా పేదల బతుకుల్లో చీకట్లే ఉన్నాయన్నారు. వీటిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించాలని సూచించారు. లేకపోతే ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. ఆ పరిస్థితి వస్తే ప్రజా ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు