గోశాలల ఏర్పాటుకు కమిటీ :సీఎం రేవంత్!!

గోశాలల ఏర్పాటుకు కమిటీ! ప్రణాళికలు సిద్ధం చేయాలన్న సీఎం రేవంత్!!
జ్ఞానతెలంగాణ,ప్రధాన ప్రతినిధి,హైదరాబాద్ :రాష్ట్రంలో గోశాలల ఏర్పాటుకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయాలని, నిర్ణీత గడువులోగా కమిటీ పూర్తిస్థాయి ప్రణాళికతో రావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో గోశాలల అభివృద్ధి, నిర్వహణ, సంరక్షణపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అధికారులతో నేడు (శనివారం) సీఎం రేవంత్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గోసంరక్షణ, నిర్వహణ సులువుగా ఉండేందుకు వీలుగా గోశాలల ఏర్పాటు ఉండాలన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ, కళాశాలలు, అగ్రికల్చర్ యూనివర్సిటీ, కళాశాలలు, దేవాలయాలకు సంబంధించిన భూముల్లో గోశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు.
ఇందు కోసం అందుబాటులో ఉన్న స్థలాలను గుర్తించాలన్నారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణానికి తగ్గకుండా గోశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇరుకు స్థలాల్లో బంధించినట్లుగా కాకుండా మేత మేసేందుకు, స్వేచ్ఛగా తిరిగేందుకు వీలుగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో గోశాలలు ఏర్పాటు చేసేందుకు పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణ, సంరక్షణలో ధార్మిక సంస్థలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. గోశాలల నిర్మాణం, నిర్వహణ, సంరక్షణకు సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్ అంచనాలతో ప్రణాళికలు రూపొందించాలన్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లిలో ఏర్పాటు చేయనున్న గోశాలకు సంబంధించి పలు డిజైన్లను ఈ సంద్భంగా సీఎం పరిశీలించారు. షెడ్ల నిర్మాణం, ఇతర డిజైన్లలో పలు మార్పులను సూచించారు. మరో నాలుగైదు రోజుల్లోగా తుది మోడల్‌ను ప్రభుత్వం ఖరారు చేయనుంది. ఈ సమీక్షా సమావేశంలో సీఎంఓ అధికారులు శేషాద్రి, శ్రీనివాసరాజు, మాణిక్ రాజ్, అజిత్ రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సవ్యసాచి ఘోష్, హెచ్ఎం ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, పశుపోషణ విభాగం డైరెక్టర్ బి.గోపి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
మరోవైపు.. వేములవాడ రాజన్న ఆలయంలో కోడెలు మరణించడం తీవ్ర కలకలం రేపుతోంది. రెండు రోజుల క్రితం దాదాపు ఎనిమిది కోడెలు మృత్యువాత పడగా.. మరో 10 కోడెలు అనారోగ్యంతో బక్కచిక్కిపోయిన ఉన్నట్లు తెలుస్తోంది. రాజన్న భక్తులు మొక్కులు చెల్లించుకునేందుకు స్వామి వారికి కోడెలను అందజేస్తుంటారు. గోశాలలో దాదాపు రెండు వేల వరకు కోడెలు, ఆవులు ఉన్నాయి. కోడెల సంరక్షణ కోసం 11 షెడ్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ షెడ్లలో ఉండాల్సిన వాటికంటే ఎక్కువగా కోడెలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కోడెల సంఖ్యలకు సంబంధించి అధికారులు సరైన సమాధానాలు చెప్పకపోవడం, కోడెలకు ట్యాగ్‌లు లేకపోవడంతో అనేక కోడెలు పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా దేవుడికి మొక్కుగా ఇస్తున్న కోడెలు ఇలా అధికారులు నిర్లక్ష్యం కారణంగా మృత్యువాతపడటం పట్ల భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

You may also like...

Translate »