జ్ఞానతెలంగాణ,హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ – తెలంగాణ (దోస్త్) ద్వారా డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలపై సందిగ్ధత నెలకొంది. సాధారణంగా ఇంటర్ ఫలితాలు వెలువడిన మరుసటిరోజే దోస్త్ షెడ్యూల్ జారీచేసేవారు. ఈసారి ఫలితాలు వచ్చి వారం రోజులైనా నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందో ఉన్నత విద్యామండలి అధికారులు కూడా చెప్పలేకపోతున్నారు. ఈసారి రెండు విడతల్లోనే దోస్త్ ద్వారా ప్రవేశాలు నిర్వహించి జూన్ 16 నుంచి తొలి సెమిస్టర్ తరగతులను ప్రారంభించాలనుకున్నారు. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడకపోవడంతో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం తరగతులు మొదలవుతాయా? లేదా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.ఈసారి దోస్త్‌లో బకెట్ విధానాన్ని తొలగించాలని కొద్దిరోజుల క్రితం ఉన్నతవిద్యామండలి కార్యాలయంలో జరిగిన ఉపకులపతుల సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు. అయితే ఆ నిర్ణయం తీసుకునే అధికారం ఉన్నత విద్యామండలికి గానీ.. వీసీలకు గానీ లేదని, తమకు సమాచారం లేకుండా.. తమ ఆమోదం లేకుండా ఎలా నిర్ణయం తీసుకుంటారని విద్యాశాఖలోని ఓ అధికారి ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పది రోజుల క్రితం వీసీలతో సమావేశం నిర్వహించి.. ఈసారికి యథాతథంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిసింది. అయితే ఆ సమావేశానికి సంబంధించి తీర్మానాల కాపీ (మినిట్స్) ఇంతవరకు అందలేదు. దాంతో ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేయలేదని తెలుస్తోంది.