ఫలితాలు కాదు, ప్రయత్నాలే నిజమైన విజయం

  • ఒక పరీక్షలో ఓడితే జీవితంలో ఓడిపోయినట్టు కాదు
  • తల్లిదండ్రులూ.., పిల్లలను ప్రేమించండి
  • తోటి విద్యార్థులతో పోల్చి మానసికంగా కృంగదీయకండి

ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంలో కొందరికి ఆశించిన ఫలితాలు రాకపోవడం వలన, కొందరు తల్లిదండ్రులకు కనపడకుండా పారిపోవచ్చు, కొందరు భోజనం చేయకుండా కూర్చుంటారు, మరికొందరు కన్నీళ్లతో బాధపడతారు. కొంతమంది మానసికంగా కృంగిపోతారు, బాధ, నిరాశ మనుషులకే సహజం. కానీ ఆ బాధను తట్టుకుని ముందుకు వెళ్లడమే అసలైన ధైర్యం. ఒక పరీక్షలో ఫెయిల్ అవ్వడమంటే అంతా అయిపోయినట్టుకాదు. అది ఒక తాత్కాలిక ఆటంకం మాత్రమే. ఫలితాల వల్ల మన విలువ తూచలేరు. మీరు చదువులో ఫెయిల్ అయితే అది మీ జీవితాన్ని నిర్ణయించదు. మీరు ఎన్ని సార్లు పడిపోతేనేం — ఒకసారి గెలిస్తే చాలు, ప్రపంచం మొత్తం మీవైపే చూసి ఆశ్చర్యపడుతుంది. ఓటమి అనేది నెగిటివ్ భావన కాదు. అది మనకు కొత్తగా ప్రయత్నించాల్సిన అవసరం గుర్తు చేసే గడియారం వంటిది.

మనం ఓడితే బాధపడొచ్చు, కానీ ఆ బాధలో నిలబడితే విజయం మనదే. థామస్ అల్వా ఎడిసన్ విద్యుత్ బల్బును కనిపెట్టే ముందు వెయ్యికి పైగా సార్లు ఫెయిల్ అయ్యారు. కానీ ఆయన ఒక్క మాట చెప్పారు — “నేను వెయ్యిసార్లు విఫలమయ్యానని కాదు, ఫలితం ఇవ్వనిది ఎలా చేయకూడదో వెయ్యిసార్లు నేర్చుకున్నాను అని సందేశం ఇచ్చారు.

మన భారతదేశపు గర్వకారణమైన మాజీ రాష్ట్రపతి ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు చదువులో చాలా సాధారణ విద్యార్థి. కానీ ఆయన కలలు పెద్దవిగా ఉండేవి. అతను తన కలలను నిజం చేసేందుకు అహర్నిశలు కష్టపడ్డాడు. ఫలితంగా ఆయన దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి — స్టీవ్ జాబ్స్, డిస్నీ కంపెనీ వ్యవస్థాపకుడు వాల్ట్ డిస్నీ, అల్బర్ట్ ఐన్‌స్టైన్… వీళ్లంతా జీవితంలో ఎన్నో సార్లు ఓడిపోయారు. కానీ తాము ఓడిపోయిన ప్రతిసారీ తిరిగి ప్రయత్నించారు. అదే వాళ్లను మహానీయులుగా మార్చింది.

మీరు కూడా ఓటమితో నెట్టేసే వ్యక్తులు కావద్దు. మీరు మీ తల్లిదండ్రుల ఆశ. మీరు మీ అన్నదమ్ముల ఆశయ స్వరూపం. మీరు మీ అక్కాచెల్లెళ్ల గర్వకారణం. ఈ విషయాన్ని మీరు మర్చిపోకూడదు — మీరే వాళ్లలోకం. ఇప్పుడు ఒక విషయం గట్టిగా చెప్పుకోండి — పరీక్షలలో విఫలమైతే సూసైడ్ మార్గం కాదు. అది పరిష్కారం ఎంత మాత్రం కూడా కాదు. అది మీ కుటుంబీకుల గుండెలలో బద్దలు చేసే బాధాకర నిర్ణయం. మీ తల్లిదండ్రులు మీ జీవితాన్ని చీకటిలో మాయమయ్యేలా చూడరు. మీరు అలా చేయకూడదు. ఒక్క ఫలితం వలన మీరు జీవితం వదిలేయాల్సిన అవసరం లేదు. కనుక ఈ ఫలితాల సమయంలో తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా, భయపడకండి. మీరు గెలవక తప్పదు — ఈసారి కాదు, ఇంకోసారి. కానీ మీరు గెలుస్తారు. ఎందుకంటే మీరు గట్టిగా ప్రయత్నించబోతున్నారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి — మీ పిల్లలు తక్కువ మార్కులు తెచ్చుకున్నా, పరీక్షలు తప్పిపోయినా వారిని గద్దించకండి. మానసికంగా కుళ్ళిపోయేలా ప్రవర్తించకండి. ఇతరులతో పోల్చి వారిని తగ్గించడం చేయకండి. ప్రతి బిడ్డ ప్రత్యేకం, వారి విజయానికి మీ ప్రోత్సాహమే ప్రధాన సాధనం. వాళ్ల పక్కన కూర్చొని భుజం తట్టి ధైర్యం చెప్పండి. “ఈసారి కాకపోతే ఏమి కాదు, ఇంకోసారి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు” అనే మాట ఒక్కటే వారిలో విశ్వాసాన్ని నింపుతుంది. సున్నితమైన హృదయం ఉన్న పిల్లలతో ప్రేమగా వ్యవహరించండి. వారిని విమర్శించే బదులు, వారి భుజం తట్టి ప్రోత్సహించండి వారి కలలకు మీరే తోడు కావాలి. ఈ సమయంలో వాళ్లతో కలిసి గడపండి, సరదాగా ఉండండి. ఒక ఫలితమే వారి భవిష్యత్తు కాదు — వాళ్ల ప్రయత్నమే నిజమైన విజయాన్ని తెస్తుంది.


– రత్నం నాని
జ్ఞాన తెలంగాణ ప్రతినిధి, శంకర్ పల్లి

You may also like...

Translate »