నేచర్ లేనిదే ఫ్యూచర్ లేదు


ప్రపంచ ధరిత్రి దినోత్సవం – పచ్చని భూమి కోసం సంకల్పం


మనమందరం జీవించేది ఒకే భూమిపై. ఈ భూమే మన ఊపిరికి ఆక్సిజన్, మన బతుకుకు ఆధారం. అలాంటి భూమిని మనం పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా వుంది అందుకే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకునే ధరిత్రి దినోత్సవం.ఈ భూమి పట్ల మన బాధ్యతను గుర్తు చేస్తుంది…

ధరిత్రి దినోత్సవం ఆవిర్భావం

1970లో అమెరికాలో పర్యావరణ విధ్వంసాలకు వ్యతిరేకంగా ప్రారంభమైన ప్రజా ఉద్యమమే ఈ రోజు ప్రపంచ ఉద్యమంగా మారింది. ఇప్పటి వరకు 193 కు పైగా దేశాల్లో, మిలియన్ల మందికి పైగా ప్రజలు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ఈ దినోత్సవానికి ఒక అంశాన్ని కేటాయిస్తారు. ఈ సంవత్సరానికి సంబంధించిన అంశం: “ప్లానెట్ vs ప్లాస్టిక్స్” – అంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి భూమిని రక్షించడమే ప్రధాన ఉద్దేశ్యం.

భూమి ఎదుర్కొంటున్న ముప్పులు:

వాతావరణలో మార్పులు
అడవుల నాశనం
నేల క్రమక్షయం
నీటి వనరుల కొరత
వాయు మరియు నీటి కాలుష్యం
ప్లాస్టిక్ దుష్పరిణామాలు
జీవవైవిధ్యం కోల్పోవడం

ఈ ప్రతికూలతలకు ప్రధాన కారణం మనిషి స్వార్థపు ఆలోచనలు అభివృద్ధి పేరుతో ప్రకృతిని నాశనం చేస్తూ తాత్కాలిక లాభాల కోసం భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాం.

ప్రకృతిని నాశనం చేసి చేసే అభివృద్ధి భావితరాలను అంధకారంలోకి నెడుతుంది
రైతు కన్నా భూమిని బాగా అర్థం చేసుకునే వాడు లేడు కానీ నేడు..
వ్యవసాయ రంగం ప్రకృతి మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇప్పుడు అదే వ్యవసాయ విధానాలు మట్టిని విపపూరితం చేసి భూమిని నిర్జీవంగా మారుస్తున్నాయి. అధిక రసాయన ఎరువులు , పురుగు మందుల వినియోగం, నీటిని వృథా చేయడం వంటి పరిణామాలు మన ఆహార భద్రతను, భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

ధరిత్రి దినోత్సవం – కేవలం రోజు కాదు, భావితరాల భవిష్యత్తుకు మార్గం
ఈ దినోత్సవాన్ని ఒక కార్యక్రమంగా కాకుండా, ఒక జీవనశైలిగా మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ కొన్ని సాధారణ మార్పులను జీవితంలో తెచ్చుకుంటే, భూమిని రక్షించగలుగుతాం:

పర్యావరణ హితమైన వ్యవసాయం (జీవ, సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం)
అడవులను సంరక్షించడం, మొక్కలను నాటడం

ప్లాస్టిక్ రహిత జీవనం

నీటి వృథా నివారణ

సౌర, వాయు శక్తి వాడకం పెంచడం

రెడ్యూస్, రెస్క్యూ, రేసైకిల్ (RRR) ని జీవన ప్రమాణంగా మార్చుకోవడం
వంటివి మట్టిలో జీవనశక్తిని నిలబెట్టే చర్యలు
ఇటీవల అకాల మరణం చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య లాంటి ఎంతో మంది కృషి ఫలితంగా భూమిపై ఇంకా కొంత వరకన్నా పచ్చదనం విరాజిల్లుతుంది అలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని నేటి యువత ప్రకృతి పరిరక్షణలో ముందుండాలి..

ప్రకృతి పరిరక్షణలో యువత పాత్ర

భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. ప్రకృతిని పరిరక్షించడంలో యువత ముందుండాలి. స్కూల్స్, కాలేజీల్లో పచ్చదనం కార్యక్రమాలు, అవగాహన ర్యాలీలు, గ్రీన్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి. సాంకేతికతను ఉపయోగించి పర్యావరణ సంరక్షణపై ఆవిష్కరణలు చేయాలి.

ధరిత్రి దినోత్సవం ఒక రోజు మాత్రమే కాదు నేటి తరానికి మేల్కొలుపు కావాలి. ప్రకృతి మనందరికీ ఎంతో మేలు చేస్తుంది. ఇప్పుడు మనం స్పందించాల్సిన సమయం వచ్చింది
ప్రకృతిని ప్రేమిద్దాం. ప్లాస్టిక్‌ను నిర్మూలిద్దాం..
భూమి మనది మాత్రమే కాదు – రేపటి తరాలది కూడా. అందుకే ఒక పచ్చని సారవంతమైన భూమిని భవిష్యత్తు తరాలకు అందించడం మన అందరి బాధ్యత


-జి.అజయ్ కుమార్ కాలామిస్ట్

You may also like...

Translate »