శంకర్ పల్లి అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన ఎంపీడీవో వెంకయ్య గౌడ్

– ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సమీక్షలో కీలక ఆదేశాలు
– అన్ని విభాగాల్లో సమగ్ర సమీక్ష
– మండల స్థాయిలో క్రియాశీల చర్యలు అవసరం
– ఎంపీడీవో వెంకయ్య గౌడ్
జ్ఞాన తెలంగాణ – శంకర్పల్లి:
శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) వెంకయ్య గౌడ్ నేతృత్వంలో వారాంతపు సమీక్ష సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మండల కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, మండల ప్రణాళికాధికారి, వ్యక్తిగత సహాయకులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మండల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని అనేక కీలక అంశాలపై సమీక్ష జరిపారు.
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులకు సంబంధించి మొదటి, రెండవ, మూడవ జాబితాలను స్పష్టంగా సిద్ధం చేయాలని, అర్హులైన వారి ఆధార్ వివరాలు సేకరించి భద్రపరచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి గ్రామంలో త్రాగునీటి సరఫరా నిరవధికంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని, చిన్న సమస్యలకైనా తక్షణమే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అవసరమైతే వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.
శానిటేషన్ వ్యవహారాల్లో రోడ్లు, కాలువలు, తడి చెత్త, పొడి చెత్తను పద్ధతిగా నిర్వహించాలనీ, ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపులో ఏమాత్రం నిర్లక్ష్యం చేయరాదని హెచ్చరించారు. పెన్షన్ వ్యవహారాల్లో మరణించినవారి, వలస వెళ్లినవారి వివరాలను సమీక్షించి, అవి సరైనవని నిర్ధారించిన అనంతరం మాత్రమే తొలగించాలని సూచించారు.
పంచాయతీ ఆస్తుల నిర్వహణలో శ్మశాన వాటికలు, చెత్త నిల్వ కేంద్రాలు, నర్సరీలు, గ్రామీణ ఉపాధి కేంద్రాలను క్రమబద్ధంగా నిర్వహించాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం మొక్కలకు నీరు పోసిన అనంతరం ఫోటోలు అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకాల కింద రోజువారీ కూలీలకు మరింత ప్రోత్సాహం కల్పించి, తగిన సదుపాయాలు అందించాలన్నారు. నర్సరీలు మరియు మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలిపారు.
పన్నుల వసూలు విషయంలో వందకు వంద శాతం వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఆలస్యం జరిగినట్లయితే దీనిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామ స్థాయి సమీక్ష కమిటీల పాత్రను చురుకుగా వాడుకోవాలని సూచించారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకునే చివరి తేది ఏప్రిల్ 14 అని తెలిపారు. ఈ సమాచారం ప్రతి యువతికి అందేలా ప్రచారం నిర్వహించాలని, ఆన్లైన్లో దరఖాస్తు చేసినవారు తగిన ధ్రువపత్రాలు మండల కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. ఆదాయ ధ్రువీకరణ లేని వారు రేషన్ కార్డు ఆధారంగా దరఖాస్తు చేయవచ్చని ఎంపీడీవో స్పష్టం చేశారు.