ఇక ఇంజినీర్ల రిజిస్ట్రేషన్‌కు ‘ఐపెక్‌’

ఇక ఇంజినీర్ల రిజిస్ట్రేషన్‌కు ‘ఐపెక్‌’


లాయర్లు, ఆర్కిటెక్ట్‌లు, సీఏలకు సభ్యత్వం తప్పనిసరి,కొత్త ముసాయిదా విడుదల చేసిన ఏఐసీటీఈ.న్యాయ విద్య పూర్తి చేసిన వారు లాయర్లుగా ప్రాక్టీస్‌ చేయాలంటే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ)లో సభ్యత్వం పొందాల్సిందే. ఆర్కిటెక్ట్‌లు, ఛార్టెర్డ్‌ ఎకౌంటెంట్లు (సీఏ)లు, ఫార్మాసిస్టులూ అదే విధానం పాటించాలి. అలాగే ఇంజినీర్లకు సైతం ఇక నుంచి ఓ కౌన్సిల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇండియన్‌ ప్రొఫెషనల్‌ ఇంజినీర్స్‌ కౌన్సిల్‌ (ఐపెక్‌) పేరిట ఏర్పాటయ్యే సంస్థ దేశవ్యాప్తంగా ఇంజినీర్ల నమోదుకు, పర్యవేక్షణకు, నియంత్రణకు బాధ్యత వహించనుంది. ఈ మేరకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఓ ముసాయిదా బిల్లును మంగళవారం విడుదల చేసింది. దీనిపై ఈ నెల 10లోపు అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలపాలని పేర్కొంది. నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఇంజినీరింగ్‌ నిపుణులకు కూడా ఓ స్వతంత్ర సంస్థ అవసరమని ‘జాతీయ విద్యా విధానం-2020’ సిఫారసు చేసింది. ఈ క్రమంలో ఇంజినీర్లలో నైతిక ప్రమాణాలు, నైపుణ్యం, జవాబుదారీతనం పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఐపెక్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ కౌన్సిల్‌లో కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి, ఐఐటీల సంచాలకులు, ఏఐసీటీఈ మాజీ ఛైర్మన్లు, ఇంజినీరింగ్‌ పరిశ్రమ నుంచి నిపుణులు, కేంద్ర ప్రభుత్వం నియమించే సభ్యులు ఉంటారు. సెర్చ్‌ కమిటీ ఐపెక్‌ అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఐపెక్‌ బోర్డులో 16 మంది నామినేటెడ్‌ సభ్యులు, గుర్తింపు పొందిన ఇంజినీరింగ్‌ సంస్థల నుంచి మరో 11 మంది ప్రతినిధులు ఉంటారు.

You may also like...

Translate »