ప్రజాసేవలో నిబద్ధతతో పని చేయాలి

గ్రామ సెక్రటరీలకు ఎంపీడీవో సూచనలు
జ్ఞాన తెలంగాణ, ప్రతినిధి, శంకర్పల్లి: మండలంలోని అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని, ప్రజలకు అందాల్సిన సేవల్లో ఎలాంటి జాప్యం లేకుండా పని చేయాలని శంకర్పల్లి మండల అభివృద్ధి అధికారి వెంకయ్య గౌడ్ (ఎంపీడీవో) గ్రామ సెక్రటరీలకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలు అర్హుల వద్దకు చేరేలా ప్రత్యేక నిబద్ధతతో పనిచేయాలని స్పష్టం చేశారు.అధికారులు గ్రామాల్లో ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించాలని, ఇందిరమ్మ ఇళ్ల జాబితాను తుది మెరుగులు దిద్దేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులైన పేదలను ఖచ్చితంగా గుర్తించి,ఎవరూ అన్యాయానికి గురి కాకుండా జాబితాను పూర్తిస్థాయిలో రూపొందించాలని ఆదేశించారు. మండలంలో పన్నుల వసూళ్లను వంద శాతం పూర్తి చేయాలని, ఎవరూ బకాయిలు ఉంచకుండా కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.మండలంలోని నర్సరీలను పూర్తిగా మెరుగుపరిచేందుకు వ్యవస్థాపిత ప్రణాళికతో పని చేయాలని అధికారులకు సూచించారు. అలాగే, ఉపాధి హామీ పనులను వేగంగా పూర్తి చేయాలని, పనులు జరుగుతున్న ప్రదేశాల్లో సైట్ ఫెసిలిటీస్‌లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని స్పష్టం చేశారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడంలో ఎవరు అలసత్వం ప్రదర్శించినా, నిర్లక్ష్యం వహించినా తీవ్ర చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హెచ్చరించారు. ప్రజలకు తక్షణ సేవలు అందించడంలో అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండలంలోని గ్రామ సెక్రటరీలు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు.