2025 జనవరి 26న భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకుంది. భారత దేశ రిపబ్లిక్ ప్రస్తానాన్ని గుర్తు చేసుకునే “అమృతోత్సవ” సందర్భం మాత్రమే కాకుండా, రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన అశలు,ఆశయాలు,లక్ష్యాలు, ప్రజల ఆకాంక్షలతో పాటు ఈరోజున ఎదురవుతున్న సమస్యలను,భవిష్యత్ సవాళ్లను పునఃపరిశీలించాల్సిన సమయం ఆసన్నమైంది.
ఈ రాజ్యాంగ ‘ప్రవేశిక’ లో పొందుపరిచిన స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వం,న్యాయం, సార్వత్రిక ప్రజాస్వామ్యం వంటి విలువలు భారతదేశ విభిన్నతలో ఏకత్వాన్ని పరిరక్షించే పునాదులు.
ప్రస్తుతం భారత రాజ్యాంగం అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా 2014లో ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం నుండి గత పదేళ్ళ పాలనలో పెను సవాళ్ళను ఎదుర్కొంటుంది. దేశంలో రాజకీయ,పాలనా విధానాలు, రాజ్యాంగ నిబంధనల్ని,దాని మౌలిక సూత్రాలను ప్రశ్నార్థకం చేస్తూ భిన్న సంస్కృతులలో విలసిల్లే దేశాన్ని ఏకీకృత ప్రభుత్వంగా మార్చే ప్రయత్నాలు సాగుతున్నాయి.
సమాఖ్య వ్యవస్థపై దాడి
భారత దేశం సహకార సమాఖ్య వ్యవస్థను కలిగి ఉంది అని కే.సీ.వేర్ అనే రాజ్యాంగ నిపుణుడు పేర్కొన్నాడు.కానీ రాజ్యాంగంలో మాత్రం భారత్ ఫెడరల్ ప్రభుత్వమని చెప్పలేదు. “యూనియన్ ఆఫ్ స్టేట్స్ ” గా (రాష్ట్రాల కలయికగా) పేర్కొన్నారు. కేంద్రం- రాష్ట్ర ప్రభుత్వాల మధ్య స్పష్టమైన అధికార విభజనను కేంద్ర జాబితా,రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా,అవశిష్ట అధికారాల పేరట అధికారాల విభచేశారు.ఇకపై వాటి పరిధుల్లో స్వేచ్ఛగా పనిచేసుకొనే వెసులు బాటు కల్పిస్తూ, అధికారాల సమతుల్యతను పాటిస్తూ రూపొందించబడింది.
కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వ పాలన ఈ సమతుల్యాన్ని.. తన నియంత్రణా విధానాల ద్వారా దెబ్బతీస్తోంది. ఉదాహరణకు, డీమోనిటైజేషన్, వస్తుసేవల పన్ను (జిఎస్టీ) వంటి ఆర్థిక విధానాలు రాష్ట్రాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. జిఎస్టీ కారణంగా కొన్ని రాష్ట్రాలు తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి.వాటి ఆదాయాలు గణనీయంగా దెబ్బతిన్నాయి.జీఎస్టీ అమలు చేస్తే, రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని భర్తీ చేసే విధంగా అదనపు నిధులను విడుదల చేస్తామని కేంద్రం నమ్మబల్కింది. ఒకటి, రెండు సంవత్సరాలు అలాగే భర్తీ చేశారు.మూడవ సంవత్సరం నుండి నిలిపేసి కేంద్రం మాట తప్పింది. అదనపు నిధులు కావాలంటూ రాష్ట్రలు ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. రాష్ట్రాలు క్రమంగా అప్పుల ఊబిలో కూరుకు పోయాయి.పైగా సంక్షేమ కార్యక్రమాలను నిలిపేయాలీ అంటూ సలహాలూ, సూచనలు పంపుతుంది.ఏ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఆ రాష్ట్రానికి ప్రధాని మంత్రి మోదీ వెళ్ళి భహిరంగ సభల్లో తమ పార్టీని గెలిపిస్తే ఆరాష్ట్రానికి లక్షల కోట్ల విలువ చేస్తే సంక్షేమ పథకాలను వాగ్ధానాలు చేసి వస్తారు. రాష్ట్రాలకు మాత్రం సుద్దులు చెబుతారు.
రాష్ట్ర జాబితాలో అంశాలలో జోక్యం:
వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశం. అయినా కేంద్రం రాష్ట్రాలతో కనీసం సంప్రదించకుండా 3 వివాదాస్పద రైతు చట్టాలు తెచ్చి అల్లకల్లోలం సృష్టించింది. ఎం.ఎస్. స్వామినాథన్ సూచించిన కనీస మద్ధత్తు ధరను చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు దేశ రాజధాని సరిహద్ధుల్లో చారిత్రాత్మక పోరాటం చేసిన ఫలితంగా కేంద్రం ఆ 3 చట్టాలను జరగబోయే ఎన్నికలలో భాగంగా రద్ధు చేసి పార్లమెంటులో భారత ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పారు. ఆ నల్ల చట్టాలను రద్దు చేశారు. అయినా కేంద్రం 750 మంది రైతు ప్రాణాలను బలి తీసుకొన్నప్పటికీ రైతు డిమాండ్లు నేటికీ నెరవేరలేదు. పలు దఫాలుగా రైతు ఉద్యమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
గవర్నర్ల పాలన:
కేంద్రం చేత నియమించబడిన గవర్నర్లు,లెఫ్టి నెంట్ గవర్నర్లు రాజ్యాంగం ప్రకారం నడుచుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధాన కర్తలుగా పనిచేయాలి. కానీ బీజేపీ పార్టీ కార్యకర్తలుగా,కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా పనిచేస్తూ ప్రజల ద్వారా ఎన్నిక కాబడిన రాష్ట్ర ముఖ్య మంత్రులను పొలిటికల్ ఎజెండాతో పాలిస్తూ,సమాంతర పాలన చేస్తున్నారు. గవర్నర్లు తమ అధికారాలను దుర్వినియోగం చేసి, ప్రతిపక్ష పార్టీలు ఉన్న రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల పాలనను అడుగడుగునా అడ్డుకుంటున్నారు.సుప్రీం కోర్టు మొట్టికాయలు వేస్తూ,సలహాలూ,సూచనలు చేసినా వినే పరిస్థితి లేదు.డిల్లీ,కేరళ, తమిళనాడు, తెలంగాణలో వారు రాష్ట్ర ముఖ్యమంత్రులతో, క్యాబినెట్ నిర్ణయాలను తోసిపుచ్చి ఘర్షణ వైఖరి తీసుకున్నారు.ప్రజలు ఎన్నుకోక పోయినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గవర్నర్ల సహకారంతో అనేక విపక్ష రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టి అక్రమ మార్గంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
మత నిరపేక్షతను దెబ్బతీయడం
భారత రాజ్యాంగం ప్రాథమికంగా మత నిరపేక్షతను గౌరవిస్తుంది.మనది మతాతీత లౌకిక రాజ్యం.రాజ్యం అన్ని మతాలను సమదృష్టితో చూడాలి. కానీ,గత పదేళ్ళుగా మత పరంగా కేంద్రం చొరవతో బీజేపీ, ఆరెస్సెస్ అనుబంధ సంస్థలు బలపడి మైనార్టీల చర్చిలు,మసీదులు,ఇళ్ళు,దుకాణాలు బుల్డోజర్ తో కూలగొట్టడం,భౌతిక దాడులు చేస్తుంది
మణిపూర్ లో ధారుణాలు:
గిరిజన మహిళలను నగ్నంహా వీధుల్లో ఊరేగించి,గ్యాంగ్ రేప్ జరిపి హత్య చేశారు. రెండు తెగల మధ్య హింసను ప్రేపిస్తున్నారు. సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ మణిపూర్ మంటల్లో మండుతూనే ఉంది. భారత ప్రధాని కనీసం ఒక్కసారి కూడా బాధితులను చూసి పరామర్శ చేయలేదు. దేశ,విదేశీ మీడియా విమర్శించినా పట్టించు కోలేదు.కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుల,మత సామాజిక విభజనలను పెంచుతుంది.
జమ్మూ కాశ్మీర్ సమస్య:
అక్కడ 370వ అధికరణ రద్దు, యూనిఫామ్ సివిల్ కోడ్ ప్రతిపాదన, అయోధ్య రామమందిర నిర్మాణం,సనాతన హిందుత్వ పోకడలతో ప్రజలు ఏమి తినాలో , ఏదుస్తులు ధరించాలో నిర్ధేశించే చర్యలు మత నిరపేక్షత పై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.దేశ లౌకిక వాద మూలాలను కూల్చి వేస్తున్నాయి. మసీదులను తవ్వి ఆలయాల అవశేషాల కోసం ఆరెస్సెస్, బీజేపీ యువత వెతుకుతుంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో హత్యలు,అత్యాచారాలు,సామూహిక హింసలు, జరగటం మామూలు అయింది. క్రైమ్ రేటు పెరిగింది. చివరకు విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీసే భారత దేశ చరిత్ర-సంస్కృతి పాఠ్యాంశాల్లో మార్పులు మతపరమైన మూర్ఖత్వాన్ని బలపరుస్తున్నాయి.
విదేశీ సంబంధాలు – బలహీనతలు
భారత విదేశాంగ విధానంలో కొన్నేళ్లుగా స్పష్టమైన లోపాలు కనిపిస్తున్నాయి. శ్రీలంక, నేపాల్, పాకిస్తాన్ వంటి పక్కదేశాల తోపాటు, ఆఫ్ఘనిస్తాన్ , మాల్దీవులతో కూడా మన సంబంధాలు అట్టడుగుకు పడిపోయాయి. కెనడాతో గతంలో మంచి సంబంధాలు కొనసాగినప్పటికీ, ఇటీవల స్నేహభావం తీవ్రంగా దెబ్బతింది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో సంబంధాలను ప్రతిష్ఠాత్మకంగా చూపిన మోదీ, జో బైడెన్ అధ్యక్షతన డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి అధ్యడుగా ప్రమాణ స్వీకార ఉత్సవానికి కనీసం ఆహ్వానం అందుకోలేకపోయారు. చైనా మనదేశ సరిహద్దులు దాటి సైనిక గ్రామాలను నిర్మిస్తుంది. సైనిక శిబిరాలతో తిష్టవేసింది. ఆయుధాలు,ట్యాంకర్లతో మోహరించింది. బంకర్లు ,రోడ్లు, నిర్మిస్తుంది.
బ్యాంకులను మోసగించి గుజరాతీ వ్యాపారులు
గత 10 సంవత్సరాల్లో, 28 మంది గుజరాతీ వ్యాపారులు బ్యాంకుల నుండి భారీగా అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోయారు. వేల కోట్ల రూపాయలు ప్రజాధనం రూపంలో భారత్ నష్టపోయింది. కానీ, ఆ మోసగాళ్ళను ఇప్పటికీ అరెస్టు చేయలేదు.వారి ఆస్తులు స్వాధీనం చేసుకోసు కోవటంలో ప్రభుత్వం విఫలమైంది. ఒకవైపు పెద్ద పారిశ్రామిక వేత్తలకు,కార్పోరేట్లకు పన్ను రాయితీలు ఇచ్చి, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారాలు పెంచడం మరో దురదృష్టకరమైన విషయం.
ఎన్నికల వ్యవస్థపై అనుమానాలు :
భారత ఎన్నికల సంఘం నిర్వహించిన ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అనుమానాలు, అపోహలు తలెత్తాయి. ఓట్ల లెక్కింపులో భారీ వత్యాసాలు చోటు చేసుకున్నాయి. పోలైన ఓట్లలో ప్రిసైడింగ్ ఆఫీసర్ల డైరీలో పేర్కొన్న లెక్కలకు… ఈవీఎంలో చూపుతున్న లెక్కలకు అసాధారణ తేడా ఉండటం తేలింది. ఆవ్యవస్థ పై అనుమానాలు పెరిగాయి. కోర్టుల్లో కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఇరకాటంలో స్వతంత్ర న్యాయవ్యవస్థ
న్యాయవ్యవస్థ నిష్పాక్షికంగా ఉండే పరిస్థితులు సన్నగిల్లాయి.న్యాయమూర్తుల నియామకాలపై కొలీజియం సూచనలకు కేంద్రం అడ్డుకుంటుంది. న్యాయమూర్తుల ప్రభుత్వానికి అనుకూలంగా చెప్పిన తీర్పుల ఆధారంగా పదవీ విరమణ తరువాత సుప్రీకోర్టు,హైకోర్టు న్యాయమూర్తులకు రాజ్యసభ,గవర్నర్లుగా ఇతర రాజకీయ పదవులు దక్కడంతో, కోర్టు తీర్పులపై ప్రజలకు అనుమానాలు రేకెత్తించాయి. న్యాయ వ్యవస్థ ‘కొలీజియం’లో కేంద్రం జోక్యం, న్యాయస్థాన తీర్పులను రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించడం అప్రజాస్వామికం. భారత ప్రధాని గణేషుని పూజ కోసం భారత ఛీఫ్ జెస్టీస్ ఇంటికి వెళ్ళం గతంలో ఎన్నడూ జరగలేదు. మేధావుల నుండి, లా ఎక్స్ పర్ట్స్ నండి ,మాజీ ప్రధాన న్యాయమూర్తుల నుండి సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తికి కలిగే హానిపై ఆదోళనలతో కూడిన విమర్శలు వచ్చాయి.
ఆర్థిక అసమానతలు
వివిధ కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు, రూపొందించిన విధానాలు దేశంలో ఆర్థిక అసమానతలను మరింత పెంచుతున్నాయి. రైతులు, కార్మికులు అప్పులపాలై, నిరుద్యోగ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్ద కార్పొరేట్లకు అనుకూలంగా,కార్మిక హక్కులకు భిన్నంగా 3 కార్మిక చట్టాలు రూపొందించడం ఇందుకు ఉదాహరణ.బడా పారిశ్రామిక వేత్తలకు కార్పో రేటర్లకు పన్ను రాయితీలు భారీగా ఉంటున్నాయి. మధ్యతరగతి వేతన జీవులకు పన్నుల భారం అధికంగా ఉంది.
మీడియా స్వేచ్ఛపై దాడులు
భారత మీడియా స్వేచ్ఛ అంతర్జాతీయ ఇండెక్స్ లో పతనాన్ని ఎదుర్కొంటోంది.ఇప్పుడు మేయిన్ మీడీయా అధిక శాతం అదానీ ఆధీనంలో ఉన్నాయి.ఎన్.డీ. టివితో సహా కొనేశారు. ప్రజలకు నిజాలు తెలిసే అవకాశం లేదు.ఈ ‘గోదీ మీడియా’ ప్రసారాలు,ప్రచారాలు అసత్యానికి వేదికలు. గోబెల్స్ ప్రాపగాండాకు ప్రాతిపదికలు. ఒక అబద్ధాన్ని పదే,పదే ప్రచారం చేస్తే అదే నిజమని ప్రజలు నమ్ముతారు అనే ఫ్యాసిస్ట్ సూత్రాన్ని వారు అమలు చేస్తున్నారు.అసత్యాల ప్రచారానికి, మత విద్వేషాలు రెచ్చగొట్టడానుకి సోషల్ మీడియా సంస్థలను స్వయంగా బీజేపీ, ఆరెస్సెస్ వేదికలను వాడుకుంటుందని విమర్శలు వస్తున్నాయి.
ప్రభుత్వ లోపాలను ప్రశ్నించే జర్నలిస్టులు, సంపాదకులపై అక్రమ కేసులు బనాయించి బేయిల్ రాకుండా సంవత్సరాల తరబడి జేళ్ళలో మగ్గి పోయాలా ఫ్యాబ్రికేటెడ్ అభియోగాలు మోపడాన్ని కేంద్రం ప్రోత్సాహం ఇస్తుంది.ఏళ్ళు గడిచాక వారిని సుప్రీం కోర్టు ఆధారాలు లేవని విడుదల చేస్తుంది. మహిళా జర్నలిస్టులపై దుర్భాషలు.బండ బూతులతో ట్రోలింగ్ చేయటం,కవులు, రచయితలు, ప్రొఫెసర్లు, టీచర్లను బెదిరించటం భౌతిక దాడులు చేయటం విస్తృతమవుతున్నాయి.
రాజ్యాంగ ప్రాముఖ్యతకు సవాళ్లు
ఈ పదేళ్ళ బీజేపీ పాలనలో దేశంలోని సామాజిక, ఆర్ధిక పరిస్థితులు దిగజారడం, రాజకీయ నాయకులు, బ్యూరోక్రసీ లంచగొండితనం, కాంట్రాక్టర్ల అవినీతి,నాణ్యత లేని నిర్మాణాలు,చదువుకున్న యువతలో సైతం నిరుద్యోగ సమస్యలు,సైబర్ క్రైమ్ ల పెరుగుదల, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగటం, రికార్డు స్థాయిలో రూపాయి విలువ పతనం చెందడం, పోలీసుల దమనకాండ,అక్రమ ఎన్ కౌంటర్లు, భారత రాజ్యాంగ లక్ష్యాలను,మౌలిక మానవ విలువల పతనం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయి.
ప్రజాస్వామ్య పరిరక్షణకు పిలుపు:
రాజ్యాంగ విలువలను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు, చైతన్యంతో ముందుకు రావాలి. జాతీయ సమైక్యతను నాశనం చేయడాన్ని అడ్డుకునే బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ముఖ్యంగా దేశ యువత పై ఈ బాధ్యత మరీ ఎక్కువగా ఉంది.వారు భావి భారత పౌరులు కనుక. భారత రాజ్యాంగం కేవలం చట్టాలు,నియమ,నిబంధనలతో కూడిన పుస్తకమే కాదు, భారత జనసముదాయాల కలల ప్రతిబింబం కూడా.
ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం దిక్కు తోచని క్రాస్ రోడ్డులో ఉంది. భవిష్యత్తు ఈ దేశం ప్రజల చేతుల్లో ఉంది. ప్రజలు,ప్రజా సంఘాలు,మేధావులు,విపక్షాలు భారత రాజ్యాంగాన్నీ ,దాని విలువలను కాపాడాలి.
దేశ ప్రజలందరి ఉమ్మడి కృషి, ఐక్యత విజ్ఞతపై మన రాజ్యాంగ పరిరక్షణ,దేశ ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉంది.ఈ రాజ్యాంగాన్ని,రాజ్యాంగ నిర్మాతల లక్షాలను ఆశయలను,ఆకాంక్షలను నిలబెట్టు కొనే బాధ్యత మనందరిపై ఉంది. ప్రజల సంక్షేమ జీవనం కోసమే రాజ్యం ఉంది. శాంతి, సామరస్యం,ఇంటా,బయట రక్షణతో ప్రజలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే.