నేడు జై భీమ్ నినాద సృష్టికర్త బాబు హరదాస్ 121 వ జయంతి
జై భీమ్ అనగా అర్థం ఏమిటి?
అంబేడ్కరీయుల్లో జై భీమ్ అనే మాటకు ఎక్కువగా చెప్పుకొంటున్న అర్థం ఏమిటంటే పాళీ భాషలో జై అనగా జయం కలుగు గాక అని, భీమ్ అనగా వివేకవంతులు, తెలివిగలవారు అని, జై భీమ్ అనగా ఓ వివేకవంతులారా మీకు జయం కలుగు గాక అని అంబేడ్కరీయులు అర్థం చెబుతున్నారు.
మరాఠీలోని కవిత్వంలో ఈ విధంగా జై భీమ్ నినాదం గురించి కవిత్వీకరించారు :
JAI BHIM MEANS LIGHT ..
JAI BHIM MEANS LOVE.
JAI BHIM MEANS JOURNEY FROM DARKNESS TO LIGHT…
JAI BHIM MEANS TEARS OF BILLIONS OF PEOPLE!
జై భీమ్ అంటే కాంతి, జై భీమ్ అంటే ప్రేమ,జై భీమ్ అంటే చీకటి నుండి వెలుతురు వైపు పయనం.జై భీమ్ అంటే కోట్లాది మంది ప్రజల కన్నీరు.
జై భీమ్ నినాదం ఎలా వచ్చింది?
జై భీమ్ నినాదం నేడు యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగుతోంది. తమ హక్కులు కోసం నినదించే వారందరూ ఈ జై భీమ్ నినాదం పలుకుతున్నారు. మన భారతదేశంలో అయితే ఛాందసవాదులకు, మార్పును కోరుకొని వారికి, సమానత్వాన్ని అంగీకరించని స్వార్థ దోపిడీ దారులకు గుండెల్లో దడ పుట్టిస్తోంది. మనువాదులకు ఈ నినాదం వణుకు పుట్టిస్తోంది.
జై భీమ్ నినాదాన్ని బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేడ్కర్ అనుయాయుడైన బాబు హరదాస్ మొట్టమొదటి సారిగా ఇచ్చారు.డా.అంబేడ్కర్ స్థాపించినది సమతా సైనిక దళం.మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో సమత సైనిక దళం శిక్షణా కార్యక్రమం జరిగింది. బాబు హరదాస్1935 వ సంవత్సరం జనవరి 6 వ తేదీన సమతా సైనిక దళ్ కు నియమావళిని వ్రాశారు.ఆ నియమావళిలోనే జై భీమ్ నినాదాన్ని హరదాస్ ఇవ్వడం జరిగింది. ఆరోజు నుండి జై భీమ్ నినాదం ప్రచారంలోకి వచ్చింది. జై భీమ్ నినాదం ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి బాబు హరదాస్.ఈ నినాదం డా.అంబేడ్కర్ ఉద్యమానికి జయం కలుగు గాక అని ఉద్ధేశించి ఇవ్వడం జరిగింది.
జై భీమ్ నినాదం బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ జీవితంతో ముడిపడి ఉంది.హరదాస్ అంబేడ్కర్ నెలకొల్పిన ఇండిపెండెంట్ లేబర్ పార్టీలో చురుగ్గా పనిచేశారు.పార్టీ సభ్యులు ఒకరినొకరు పలకరించుకోవడానికి ఏదైనా మంచి నినాదం ఉంటే బావుంటుందని ఆలోచించారు. జై భీమ్ అనే నినాదానికి చీకటి నుంచి వెలుగులోకి రావడం… అంబేడ్కర్ కు విజయం కలగాలి…. అని దీనికి అర్థం చెప్పాచ్చు.
జై భీమ్ నినాదం అణగారిన వర్గాల హక్కుల సాధనకు మాత్రమే కాదు సమానత్వం కోసం,హక్కులు కోసం పోరాటం సాగించే వారందరికీ ఒక అక్షర ఆయుధంగా ఉపకరిస్తోందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. జై భీమ్ నినాదం ఇచ్చిన అంబేడ్కరిస్టు బాబు హరదాస్ గురించి తెలుసుకుందాం…
మహరాష్ట్రలోని నాగపూర్ జిల్లాలోని కామఠీ పట్టణంలో బైల్ బజారు బస్తీలో బాబు హరదాస్ లక్ష్మణరావు నాగ్రాలే 1904 వ సంవత్సరం జనవరి 6 వ తేదీన జన్మించారు. పటవర్ధన్ పాఠశాలలో చదువుకున్న.హరదాస్ మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత సాధించారు. ఆరోజుల్లో నిమ్నజాతులకు చెందిన అస్పృశ్యుల నుండి చదువుకున్న వారు లేరు.అలాంటి పరిస్థితుల్లో హరదాస్ చదువుకోవడం గొప్ప విషయం.హరదాస్ అస్పృశ్యులు కోసం రాత్రి బడులు ,చోకమేళ గ్రంథాలయాలు నడిపారు.స్త్రీలకు విద్యను అందించడానికి కోసం హరదాస్ కృషి చేశారు.
హరదాస్ 17 వ సంవత్సరాల వయసులోనే నిమ్నజాతుల సమస్యలు గురించి చర్చించడానికి,ప్రజలలో, నిమ్నజాతులలో చైతన్యం తీసుకుని వచ్చేందుకు ‘మహారథ’ పేరుతో పత్రిక నడిపారు.18 వ సంవత్సరాల వయస్సులో ఉండగానే హరదాస్ అస్పృశ్యుల మీద అగ్రవర్ణాల వాళ్ళు చేస్తోన్న దాడులు నుండి ఆత్మ రక్షణ కోసం మహర్ సామాజిక వర్గాలకు చెందిన యువకులను సమీకరించి వారిలో అవగాహన కలిగించి అగ్రవర్ణాల దాడుల నుండి అస్పృశ్యులను రక్షించుకునేందుకు మహర్ యువకులతో “మహర్ సమాజ్ పాతక్” పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేశారు.ఆరోజుల్లో అస్పృశ్యులు అధికంగా బిడీ కార్మికులుగా ఉండగా అస్పృశ్యులు అధికంగా బిడీ కార్మికులుగా ఉన్న బిడీ ఫ్యాక్టరీలలో బిడీ కార్మికులు శ్రమ దోపిడీకి,మోసాలకు గురయ్యేవారు.హరదాస్ బిడీ కార్మికుల కోసం సంఘాన్ని పెట్టి బిడీ కార్మిక సంఘం పేరుతో శ్రమ దోపిడీకి, మోసాలకు వ్యతిరేకంగా సహకార వ్యవస్థను నెలకొల్పిన కార్మిక నాయకుడు హరదాస్.బ్రాహ్మణిజం వలన నిమ్నజాతుల వాళ్ళు కులాలుగా విడిపోయారు.విడిపోయన కులాలన్నింటినీ కలపడానికి హరదాస్ తరచుగా సామూహిక భోజనాలు ఏర్పాటు చేసేవారు. హరదాస్ ప్రతి సంవత్సరం 14 వ శతాబ్దానికి చెందిన అస్పృశ్యుల ఉద్ధరణ కోసం సాధువుగా మారిన సంత్ చోకమేళ జయంతి జరిపేవారు.ఈ జయంతి నాడు నిమ్నజాతుల సామూహిక కార్యక్రమాలు నిర్వహించి దళితులు అందరినీ ఐక్యం చేయడానికి తపించేవారు.
హరదాస్ రచనలు : వీర్ బాలక్, మండల్ మహాత్మా, సాంగ్స్ ఆఫ్ ద మార్కెట్ వంటి రచనలు చేశారు.హరదాస్ చిన్నతనం నుంచే విగ్రహారాధనను ఖండించారు. మూఢ నమ్మకాలను వ్యతిరేకించారు. నిరక్షరాస్యత నిర్మూలన కోసం రాత్రి బడులు నడిపారు.
డా.అంబేడ్కర్ అనుయాయిగా హరదాస్:
1928 వ సంవత్సరంలో బాబు హరదాస్ డా.అంబేడ్కర్ ను కలుసుకున్నారు. అప్పటి నుండి హరదాస్ రాజకీయ జీవితం ఊపందుకుంది అని చెప్పాలి. అంతకంటే ముందే హరదాస్ సామాజిక పరివర్తన కొరకు ఎంతగానో కృషి చేసారు. అయితే అంబేడ్కర్ పరిచయంతో హరదాస్ పూర్తిగా అంబేడ్కర్ అనుయాయిగా మారారు.హరదాస్ డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాలతో ప్రభావితం అయ్యారు. అంబేడ్కర్ అనుయాయిగా మారిపోయిన హరిదాస్ అంబేడ్కర్ చేపట్టిన ప్రతి ఉద్యమంలో ఆయనకు వెన్నుదన్నుగా నిలిచేవారు. 1930 వ సంవత్సరం ఆగస్టు నెల 8 వ తేదీన డా.అంబేడ్కర్ ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ ఫెడరేషన్ ను స్థాపించారు. ఈ సంస్థకు హరదాస్ ను సంయుక్త కార్యదర్శిగా డా.అంబేడ్కర్ నియమించారు.
డా.అంబేడ్కర్ ఫస్ట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యారు. రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కానీయకుండా గాంధీ మరియు కాంగ్రెస్ వర్గాలు కుట్రలు చేస్తారు.1930-31 వ సంవత్సరాలలో గాంధీజీ దళితుల యొక్క నిజమైన ప్రతినిధి నేనే అంటూ దళితులకు హక్కులు రాకుండా కుట్ర పన్నుతారు.గాంధీ దళితుల ప్రతినిధిగా వ్యహరించినప్పుడు హరదాస్ దళితులు యొక్క నిజమైన ప్రతినిధి గాంధీ కాదు.బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ మాత్రమే నిజమైన దళితులు యొక్క ప్రతినిధి అంటూ హరదాస్ భారతదేశం నలుమూలల నుండి వివిధ రాష్ట్రాల నుండి దళిత నాయకులతో సుమారు 32 టెలిగ్రామ్ లు ఆనాటి బ్రిటిష్ ప్రధాని రామ్సే మెక్ డొనాల్డ్ కు అందేలా కృషి చేశారు.తదనంతరం జరిగిన పూనా ఒప్పందం సమయంలో సైతం గాంధీతో జరిగిన చర్చల్లో అస్పృశ్యులకు హక్కులు కోసం కూడా హరదాస్ క్రియాశీలక పాత్ర పోషించారు.హరదాస్ సమతా సైనిక దళ్ సభ్యులతో గ్రామగ్రామాన తిరిగి గాంధీ కుట్రలను బట్టబయలు చేశారు.అలా హరదాస్ ఎంతగానో ప్రజల్లో చైతన్యం తెచ్చారు.ప్రజలను ఐక్యం చేసి ప్రజాభిప్రాయాన్ని సేకరించి ప్రజలందరి చేత లండన్ లో జరిగే రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేడ్కర్ ను సమర్థిస్తూ 32 టెలిగ్రామ్ లు కామఠి పట్టణం నుండి పంపేట్లు హరదాస్ కృషి చేశారు.దీని ఫలితంగానే రెండో రౌండ్ టేబుల్ సమావేశాలకు అంటరాని వారి ప్రతినిధిగా డా.అంబేడ్కర్ వెళ్లి మాట్లాడేందుకు అవకాశం వచ్చింది.
తన కన్న కొడుకు మరణించినా సమావేశం వదిలి వెళ్ళని నిస్వార్థ రాజకీయ నాయకుడు హరదాస్.
డా.అంబేడ్కర్ తన బిడ్డలు మరణిస్తున్న కూడా నిస్వార్థసేవకు అంకితం అయ్యారు.అంబేడ్కర్ అనుయాయి హరదాస్ 1933 లో అంసుజి ఖండారే అకోలలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి బాబు హరదాస్ అధ్యక్షత వహించారు. హరిదాస్ ప్రసంగం మధ్యలో టెలిగ్రామ్ వచ్చింది. ఆ టెలిగ్రామ్ లో Start Immediately Son Expired అని ఉంది. దానికి హరదాస్ ‘నేను వచ్చే వరకూ నా కొడుకు శవాన్ని ఉంచకండి.శవానికి అంతిమ సంస్కారాలు జరిపించండి.నేను సమావేశాన్ని వదిలి రాలేను.’ అని టెలిగ్రామ్ పంపించారు.ఈ సందర్భంగా హరదాస్ మాట్లాడుతూ “నా ఒక్క కొడుకు మరణిస్తే ఏమయింది. ఈ సమావేశానికి వచ్చిన మీరందరూ నా పిల్లలే.నా కొడుకు ఎలాగూ తిరిగి రాడు.కాబట్టి బ్రతికి ఉన్న ఈ పిల్లల్ని రక్షించడం నా బాధ్యత.” అని అన్నారు.
హరదాస్ డా.అంబేడ్కర్ నెలకొల్పిన ఇండిపెండెంట్ లేబుర్ పార్టీ (ILP) కి చీఫ్ సెక్రటరీగా,సెంట్రల్ ప్రావిన్స్, బిరార్ ప్రాంతీయ ఇన్ చార్జ్ గా పనిచేశారు.1937 వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ నుండి ఎం.ఎల్.ఎ గా హరదాస్ పూణే దగ్గరలో గల కాంప్టీ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.ఇక అప్పటి నుండి హరదాస్ సామాజిక కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారు. దీంతో ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా సమాజ పరివర్తన కోసమే నిరంతరం పనిచేశారు. దీంతో అనారోగ్యానికి లోనయ్యారు.బాబు హరిదాస్ క్షయ వ్యాధితో బాధపడేవారు. ఈ వ్యాధికి యూనాని వైద్యం చేయించారు యూనాని మందు పాలతో కలిపి తీసుకోవాలి. అయితే ఒక ఎం.ఎల్.ఎ గా సేవలందించిన హరిదాస్ కు కనీసం పాలు కొనుక్కోవడానికి కూడా తన దగ్గర డబ్బులు ఉండేవి కావు.ఈ విషయాన్ని తన మిత్రుడు ఢోండ్బాజి మోండో మేస్త్రీకు తెలిసింది అయితే అతని దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో బాబు హరిదాస్ తన భార్యతో మెడిసిన్ వేసుకోవడానికి తన దగ్గర డబ్బులు లేవని చెప్పగా,హరిదాస్ భార్య తన పాలను పిండి తీసుకుని వచ్చి తన భర్త హరిదాస్ కు ఇచ్చి యూనాని మందు పాలలో కలిపి వేసుకోమని చెబుతోంది. ఇదీ సమాజం కోసం రాజకీయాల్లో లేదా సామాజిక ఉద్యమాల్లో పనిచేసే వారి యొక్క నిస్వార్థ జీవితాలు ఇప్పుడు ఉన్న వారందరూ పచ్చి స్వార్థ పరులు, దోపిడీ మనస్తత్వం గలవారు, ఆధిపత్య భావజాలం కలవారే ఉన్నారు.
హరదాస్ 1939 వ సంవత్సరం జనవరి 12 వ తేదీన టి.బి(Tuberculosis) వ్యాధి సోకి కాలం చేశారు. డా.అంబేడ్కర్ చెప్పినట్టుగా “మనిషి జీవితం సుదీర్ఘంగా ఉండాల్సిన అవసరం లేదు, గొప్పగా ఉండాలి.” అంబేడ్కర్ పలికిన ఈ మాటలకు బాబు హరదాస్ నిలువెత్తు నిదర్శనం అని చెప్పాలి.జీవించినది చాలా తక్కువ కాలమే అయినా హరదాస్ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ఇప్పుడు కనబడుతున్న నాయకులు దాదాపుగా అవకాశవాదంతో చెంచాల వలె.తయారు అవుతున్న పరిస్థితి. ఇలాంటి దగుల్భాజీలకి హరిదాస్ లాంటి గొప్ప వ్యక్తుల త్యాగం కనబడవు.
“Growing up Untouchable in India” అనే పుస్తకంలో వసంతమూన్ ఇలా అన్నారు : “దళిత ఉద్యమాలకు దారి చూపేందుకు ఆకాశం అంతా వెలుగులు నింపి అంతలో మాయమైన తోకచుక్కలాంటి జీవితం హరదాస్ గారిది.”
మహామానవీయులు డా.అంబేడ్కర్ బాబు హరదాస్ మరణవార్త విని దుక్ఖంతో “బాబు హరదాస్ మరణంతో నా కుడిచెయ్యి పడిపోయినట్లైంది.” అని అన్నారు.
బాబు హరదాస్ తక్కువ వయస్సులోనే తుదిశ్వాస విడిచినా, ఆయన ఇచ్చిన జై భీమ్ నినాదం మాత్రం దేశ మంతటా మారుమోగుతూనే ఉంది.