నేడు భదంత ఆనంద కౌసల్యాయన్ 120 వ జయంతి


అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
బౌద్ధ ఆచరియ & న్యాయవాది


“నేను చనిపోయినప్పుడు, బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ కలలుగన్న ప్రబుద్ధ భారతదేశాన్ని తయారు చేసే యుద్ధంలో ఈ చీవరం ధరించిన సైనికుడు అమరుడయ్యాడని నా శిలా ఫలకంపై వ్రాయండి.”
—డా. భదంత్ ఆనంద్ కౌసల్యాయన్

భదంత అనగా భిక్ఖువు లేదా భగవాన్ అని అర్థం.భదంత ఆనంద కౌసల్యాయన్ 1905 జనవరి 5 న చండీఘర్ కు సమీపంలో గల సోహాన్ గ్రామంలో జన్మించారు.కౌసల్యాయన్ కు తల్లిదండ్రులు పెట్టిన పేరు హర్నామ దాస్.1920 వ సం.రంలో అంబాలా కంటోన్మెంటులోని హిందూ-మహమ్మడన్ హైస్కూలులో కౌసల్యాయన్ తండ్రి రామ శరణ్ దాస్ ప్రధానోపాధ్యాయుడిగా ఉండేవారు.ఇదే హైస్కూలులో కౌసల్యాయన్ మెట్రిక్ పరీక్షలో పాసయ్యారు.1924 వ సం.రంలో లాలా లజపతిరాయ్ నెలకొల్పిన ‘కౌమీ విద్యాపీఠం’ లో కౌసల్యాయన్ బి.ఎ. పూర్తి చేశారు..ఇదే సం.రంలో కౌసల్యాయన్ కు త్రిపిటకాచార్య,మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్ తో పరిచయం ఏర్పడింది.వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కౌసల్యాయన్ జీవిత గమనాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి రాహుల్ సాంకృత్యాయన్. రాహుల్ సాంకృత్యాయాన్ ప్రభావం వలన ఆర్య సమాజంలో సభ్యునిగా చేరి,బ్రహ్మచారి విశ్వనాథగా పేరు మార్చుకున్నారు.1924 నుండి 1926 వ సం.రం వరకూ కాంగడా జిల్లాలోని అస్పృశ్యులుగా పిలవబడుతున్ప సరాండే, డూమనే జాతులను ఉద్ధరించడం కోసం పలు కార్యక్రమాలు చేపట్టారు..1926-1927 మధ్య కాలంలో పంజాబ్ లో గల బటాలా వాల్మీకి ఆశ్రమంలో పనిచేశారు. ఒక పక్కన సన్యాసిగా ఉంటూనే కౌసల్యాయన్ స్వాతంత్ర్య పోరాటం కోసం పాటుపడ్డారు.1927 లో గౌహతిలో జరిగిన కాంగ్రెస్ సమ్మేళనంలో పాల్గొన్నారు. మరొక పక్క బౌద్ధ పుణ్య క్షేత్రాలను సందర్శించారు.1927 లో మద్రాసు నగరంలో జరిగిన కాంగ్రెసు సభలో కూడా పాల్గొన్నారు.హర్నామ దాస్ లో ఆర్య సమాజం బోధించే వేదాలు,దివ్యత్వం మీద క్రమంగా భ్రమలు తొలగిపోవడంతో బౌద్ధం పట్ల ఆకర్షితులయ్యారు. రాహుల్ సాంకృత్యాయాన్ బౌద్ధ సిద్దాంతాల ప్రభావంతో 1928 వ సం.రం జనవరి 5 న హర్నామ దాస్ శ్రీలంక దేశానికి వెళ్ళారు.హర్నామ దాస్ శ్రీలంకలో పాళీ భాషను నేర్చుకున్నారు.శ్రీలంక దేశంలోనే రాహుల్ సాంకృత్యాయన్ ను హర్నామ దాస్( కౌసల్యాయన్) కలుసుకున్నారు.

”బౌద్ధం దేవుడు ఆవిష్కరించిన(ఈశోన్మేశం) మతం కాదు.దానిని గుడ్డిగా నమ్మవలసిన పని లేదు.అందుకని అది నాకు బాగా నచ్చింది.” అని భదంత ఆనంద కౌశల్యాయన్ అన్నారు.

హర్నామ దాస్ 1928 ఫిబ్రవరి 10 న బౌద్ధ భిక్ఖువుగా మారారు.శ్రీలంకలో విద్యాలంకార పరివేణకు చెందిన ఎల్.ధమ్మానంద మహాస్థవిరుని ద్వారా హర్నామ దాస్ భిక్ఖుగా దీక్ష స్వీకరించారు.1929 లో హర్నామ దాస్ ఉపసంపద పొందారు. ధమ్మానంద భిక్ఖు హర్నామ దాస్ కు ‘ఆనంద కౌశల్యాయన్’ అనే భిక్ఖు నామాన్ని ఇవ్వడం జరిగింది.193౦-1931 వ సం.రంలో మనదేశానికి తిరిగి వచ్చిన కౌసల్యాయన్ సారనాథ్ లో గల ‘మూలగంధ కుటి’ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సారనాథ్ నుండి కౌసల్యాయన్ శ్రీలంక దేశానికి తిరిగి వెళ్ళారు.ఆనంద కౌశల్యాయన్ “మహావంశ” అనే గ్రంథాన్ని హిందీ భాషలోనికి అనువాదం చేసారు.1928లో అనగారిక ధర్మపాల లండన్ దేశంలో మహా బోధి సొసైటి స్థాపించారు.ధర్మపాల మహాబోధి సొసైటి తరపున ధర్మ దూత్యం కింద లండన్ కు రావాలని రాహుల్ సాంకృత్యాయాన్ మరియు ఆనంద కౌశల్యాయనలను కోరడం జరిగింది. 1932 లో ధర్మపాల ప్రేరణతో భదంత ఆనంద కౌసల్యాయన్ రాహుల్ సాంకృత్యాయన్ తో కలిసి ఇంగ్లండ్ లో ధమ్మాన్ని వ్యాప్తి చేసారు.రాహుల్ సాంకృత్యాయన్ ఇండియా తిరిగి ఇండియాకు వచ్చేయగా,ఆనంద కౌశల్యాయన్ మాత్రం లండన్ దేశంలోనూ,పారిస్ లోనూ,జర్మనీ దేశంలోనూ బౌద్ధ ధమ్మం గురించి ఉపన్యాసాలు చేసాడు.1934 లో పినాంగ్ లో వర్షావాసాన్ని గడిపిన కౌసల్యాయన్ బ్యాంకాక్, రంగూన్ దేశాల మీదుగా 1934 వ సం.రం చివరన ఇండియాకు తిరిగి వచ్చారు.

1934లో జగదీశ్ కాశ్యప్ వచ్చి రాహుల్ సాంకృత్యాయన్ ను ,ఆనంద కౌసల్యాయన్ లను కలుసుకున్నారు.ఈ ముగ్గురు మంచి ధమ్మ మిత్రులుగా మారి ఇండియాలో బౌద్ధ పునరుద్దానానికి ఎంతగానో కృషి చేసారు.1935-1945 సం.రం వరకూ కౌసల్యాయన్ మనదేశంలో సారనాథ్ ను కేంద్రంగా చేసుకొని ధమ్మాన్ని ప్రచారం చేశారు. బౌద్ధ ధమ్మ సాహిత్యాన్ని కూడా విస్తృతంగా వెలువరించారు.1939లో న్యూ డిల్లీ లో న్యూ డిల్లీ బౌద్ధ విహారను మహాబోధి సొసైటి వారు నిర్మించారు.ఈ విహారను గాంధీ ప్రారంభిచారు.ఈ కార్యక్రమానికి కౌసల్యాయన హాజరు అయ్యారు.ఆనంద కౌశాల్యాయన మహాబోధి సొసైటి వారు నడిపే ”ధర్మ దూత “ అనే హిందీ పత్రికకు సంపాదకునిగా వ్యవహరించాడు.139-1951 మధ్య కాలంలో కౌసల్యాయన్ విస్తృతంగా హిందీ భాషలో బౌద్ధ ధమ్మం గురించి రచనలు చేసారు. 1952 నుండి 1956 మధ్య కాలంలో కౌసల్యాయన్ ఆగ్నేయ ఆసియా బౌద్ధ దేశాలలో పర్యటించారు.1951 నుండి బాబాసాహెబ్ అంబేడ్కర్,ఆనంద కౌశల్యాయన తరచుగా కలుసుకుంటూ ఉండేవారు.అంబేడ్కర్ “పరివర్తనను(మత మార్పిడి)” గురించి పాటించ వలసిన ధమ్మ దీక్ష తీసుకునే నియమాలను గురించి కౌశల్యాయన్ ను అడిగేవాడు.బాబాసాహెబ్ తలపెట్టిన చారిత్రాత్మక బౌద్ధ దీక్షా కార్యక్రమం నాగపూర్ శిభిరానికి ఆనంద కౌశల్యాయన హాజరుకాలేదు.ఆ సమయంలో ఆనంద కౌశల్యాయన చైనా దేశంలో ఉన్నారు.మన ఇండియా తరపున అధికారిక ప్రతినిధుల సంఘానికి నాయకునిగా చైనాలో 2500 సంవత్సరం బుద్ధ జయంతి వేడుకలకు వెళ్ళడం జరిగింది.కౌశల్యాయన ఇండియాకు వచ్చాక నాగపూర్ లో జరిగిన అంబేడ్కర్ బౌద్ధ ధమ్మ దీక్షా కార్యక్రమం గురించి తెలుసుకొని,నాగపూర్ కు వెళ్ళి తరువాత ఎంతోమందికి ధమ్మ దీక్ష ఇచ్చాడు.అంబేడ్కర్ మరో ధమ్మ దీక్షను 1956 డిసెంబర్ 16 జరపాలని ప్రణాళిక వేసుకోవడం జరిగింది.ఇంతలో డిసెంబర్ 6 న హటాత్తుగా మహాపరి నిర్యాణం చెందారు.భధంత కౌసల్యాయన నిజమైన పరివ్రాజకుడు.ఒక చోట ఉండకుండా తిరుగుతూ బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేసాడు.బాబాసాహెబ్ అంబేడ్కర్ వ్రాసిన “బుద్ధ అండ్ హిజ్ ధమ్మ” పుస్తకాన్ని హిందీ భాషలోనికి అనువదించాడు.ఇండియన్ స్వాతంత్ర్య పోరాటంలో రాహుల్ జీ తో కలిసి పాల్గొన్నారు.క్విట్ ఇండియా ఉద్యమంలో పాలుపంచుకున్నారు.ఎన్నో గ్రంథాలు వ్రాసాడు.గౌరవ డాక్టరేట్లుపొందాడు.1959 1968 అక్టోబరు మాసం వరకూ కౌసల్యాయన్ శ్రీలంకలో విద్యాలంకార విశ్వవిద్యాలయంలో హిందీ భాషా విభాగ అధ్యక్షులుగా సేవలను అందించారు.1968 విజయదశమి నాటి 1982 వరకూ మహారాష్ట్రలో మని దీక్షాభూమి వద్ద ఉన్నారు. 1982-1985 సం.రాలలో ధంతోలిలోని మధుకరరావు మేశ్రామ్ నివాసంలో ఉన్నారు.1985 నుండి 1988 వరకూ మనదేశంలోనే కౌసల్యాయన్ గడిపారు.బౌద్ధ పండితుడు,ఋషి,సృజనాత్మక రచయిత అయిన కౌశల్యాయన్ తన 83 సంవత్సరాల వయసులో 1988 , జూన్ 22 అనారోగ్యంతో నిర్యాణం చెందారు.

భదంత ఆనంద కౌసల్యాయన భారతదేశంలో గొప్ప బౌద్ధ భిక్షువు, పండితుడు.20 వ శతాబ్దపు బౌద్ధ భిక్షువులలో ఆయన ఒకరు. మహాపండిత రాహుల్ సాంకృత్యాయాన్ ,బాబాసాహెబ్ అంబేడ్కర్ ల చేత ప్రభావితం అయ్యారు. తన జీవితాన్ని బౌద్ధ ధమ్మం కోసం అంకితం చేశారు. ఎన్నో దేశాలలో సుదూర ప్రయాణం చేసి కొత్త విషయాలను కనుగొన్న అనుభూతిని పొందాలని ఆయన ఎప్పుడు అనేవారు. ఆయన స్ఫూర్తితో ప్రారంభించిన సంప్రదాయాన్ని కొనసాగించడమే ఆయన లక్ష్యం. ఆనంద కౌసల్యాయన్ భారతీయ యాత్రా సాహిత్యానికి మరియు హిందీ సాహిత్యానికి ఎంతగానో సహకరించారు.చిన్నప్పటి నుండి హిందీ భాషను ఎంతగానో ఇష్టపడ్డారు. హిందీ సాహిత్య సమ్మేళనం, ప్రయాగ,రాష్ట్ర భాషా ప్రచార సమితి, వార్ధా మొదలైన వాటికి పనిచేశారు. తన రచనలు అందరికీ సులభంగా అర్థం అయ్యేలా సరళమైన భాషను ఉపయోగించారు. వివిధ ప్రాంతాలకు పర్యటించడం పై పలు వ్యాసాలు, నవలలు, పుస్తకాలు వ్రాశారు. ఇరవైకి పైగా పుస్తకాలు రచించారు.1956 డిసెంబర్ 7 న ముంబై లోని దాదర్ లో జరిగిన డా.అంబేడ్కర్ అంత్యక్రియలు కార్యక్రమంలో ఆనంద కౌసల్యాయన్ ప్రధాన సంరక్షకునిగా వ్యవహరించారు. దాదాసాహెబ్ గైక్వాడ్ ప్రేరణతో ఆకస్మిక దీక్ష వేడుకను నిర్వహించారు.22 ప్రమాణాలు కూడా పఠించడం జరిగింది. డా.అంబేడ్కర్ కు మహాపరినిర్వాణం లభించింది అని ఆయన ప్రకటించారు. ఆనంద కౌసల్యాయన్ ఆధ్వర్యంలోనే అంబేడ్కర్ గారి దహన సంస్కారాలు జరిగాయి.

భదంత ఆనంద కౌసల్యాయన్ జాతక పురాణాలను పాళీ భాష నుండి హిందీలోకి 6 సంపుటాలుగా అనువదించారు. ధమ్మపద హిందీ అనువాదం ఇవే కాకుండా, అనేక పాలీ భాషా పుస్తకాలు హిందీ భాషలోకి అనువదించారు. దీనితో పాటు అనేక మూల గ్రంథాలు కూడా రచించబడ్డాయి – ‘బాబా లేకపోతే’, జాతక కథలు, సన్యాసి లేఖలు, తత్వశాస్త్రం: వేదాల నుండి మార్క్స్ వరకు, ‘రాముని కథ, రాముని మాటలు’, ‘మనుస్మృతి ఎందుకు కాల్చివేసింది’, బౌద్ధమతం ఒక హేతువాద అధ్యయనాలు, మర్చిపోలేని బౌద్ధ జీవన విధానం, 31 రోజుల్లో పాళీ, పాళీ నిఘంటువు, సరిపుత్ర మౌద్గల్యాయన సాంచి, అనాగరిక ధర్మపాల మొదలైనవి. అంబేడ్కర్ రచించిన ‘ది బుద్ధ అండ్ హిజ్ ధమ్మ’ పుస్తకం హిందీ, పంజాబీ భాషల్లోకి అనువదించబడింది.

డా. భదంత్ ఆనంద్ కౌశల్యయన్ హిందీ సాహిత్యం మరియు బౌద్ధమతం యొక్క కృషి అసాధారణమైనది, అతను విపస్యన ఆచార్య శ్రీ సత్యనారాయణ గోయెంకా మరియు హిందీ సాహిత్యవేత్త హరివంశ్ రాయ్ బచ్చన్‌లకు గొప్ప స్నేహితుడు, డా. భదంత్ ఆనంద్ కౌశల్యయన్ సలహా మేరకు, హరివంశ్ రాయ్ బచ్చన్ జీ తన కొడుకు పేరు అమితాబ్ బచ్చన్ అని పెట్టారు.

పరుల కొరకు పాటు పడువారు ధన్యులు. వారికి నిర్వాణం ప్రాప్తించును గాక.

నాకు చైతన్య వంతుడైన భగవాన్ బుద్ధుని ప్రతిమ అంటే ఇష్టం.-బాబాసాహెబ్

ఒకసారి దాదార్ లో బాబాసాహెబ్ అంబేడ్కర్ ను కలుసుకోవాలని ఆనంద కౌసల్యాయన్ అనే బౌద్ధ భిక్షువు వచ్చారు.వారి మధ్య సంభాషణలు ఇలా సాగాయి.

అంబేడ్కర్ : భంతేజీ..! మీకు ఎలాంటి బుద్ధుని విగ్రహం అంటే ఇష్టం?

భదంత ఆనంద కౌసల్యాయన్ : నాకు ధ్యానం లో ఉన్న బుద్ధుని విగ్రహం అంటే ఇష్టం.

అంబేడ్కర్ : అవునా , మీకు ధ్యానం లో ఉన్న బుద్ధుడంటే ఇష్టమా ?

భదంత ఆనంద కౌసల్యాయన్ : అవును,

అంబేడ్కర్ : నాకు ధ్యానంలో ఉన్న బుద్ధుడు అంటే అస్సలు ఇష్టం లేదు. భిక్షాపాత్ర చేతపట్టుకొని సామాన్య జనాల వద్దకు భిక్షకు వెళ్ళి ,వారిచ్చిన భిక్ష స్వీకరించి అష్టాంగ సూత్రాలను ప్రచారం చేయడానికి వెళ్ళినట్టి బుద్ధుని విగ్రహం అంటే చాలా ఇష్టం.

చరిత భిక్ఖవే చారికం
బహుజన హితాయా!
బహుజన సుఖాయా!
అత్తానుహితాయా!
లోకానుకంపాయ!
ఆది కల్యాణా!
మధ్య కల్యాణా!
అంతః కల్యాణా!

ఈ విధంగా బాబాసాహెబ్ అంబేడ్కర్ పాళీ లో ఉన్న ధర్మ చక్ర ప్రవచనాన్ని ఆలపించారు.నేను పాలియన్ బుద్ధిజం యొక్క విద్యార్థిని,నాకు మొత్తం తెలుసు.అందుకే మీకు చెబుతున్నాను.సారనాథ్ లో తథాగతుడు ఐదుగురితో పై విధంగా ప్రవచనం చెప్పారు.ఇది పాలీ భాషలోని మాటలు.దీనర్థం ఏమిటంటే జనాలోకి వెళ్ళండి, బహుజనుల దగ్గరికి వెళ్ళండి. ధర్మాన్ని ప్రచారం చేయండి.ఈ ధర్మం బహుజనులకు ప్రారంభంలోనూ ,మధ్యలోనూ ,చివరలోనూ మంచిని చెబుతోంది. ఈ ధర్మం అల్ప జనుల కోసం కాదు. బహుజనుల కోసం అంటూ అంబేడ్కర్ ఆనంద కౌసల్యాయన్ తో అంటారు.

ఈ సంభాషణలను నిజాయితీ పరుడైన భదంత ఆనంద కౌసల్యాయన్ తనకు అంబేడ్కర్ కు మధ్య జరిగిన సంభాషణలను పుస్తకం లో వ్రాశారు. ఈరోజు భిక్షువులు ఎలా ఉన్నారంటే నేను భిక్షువును నాకు అన్నీ తెలుసు నేను చెప్పానంటే మీరు చేయాల్సిందే అన్నట్లు నియంతల మాదిరిగా ఉంటున్నారు. అంబేడ్కర్ ను చదవనే చదవరు.ఎందుకంటే అంబేడ్కర్ వాళ్ళ దృష్టిలో ఎస్సీ కాబట్టి. భదంత ఆనంద కౌసల్యాయన్ బ్రాహ్మణుడు అయినప్పటికీ నిజాయితీ పరుడు కాబట్టి పుస్తకం లో వ్రాశారు. సాధారణంగా భిక్షువులు ఎలా ఉంటారంటే ఇతరుల నుండి జ్ఞానం నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. ఇతరులు తమ కాళ్ళకు దణ్ణం పెడితే ఎంజాయ్ చేస్తుంటారు. అదే భిక్షువు ఇతరుల కాళ్ళకు దణ్ణం పెట్టరు.శ్రమ జీవుల కన్నా ఎవరూ గొప్పవాళ్ళు కాదు నా దృష్టిలో. ఎవరూ ఎవరి కాళ్ళకు దణ్ణం పెట్టాల్సిన పనిలేదు. కళ్ళతో… నవ్వుతూ కాళ్ళు చూపెడుతూ లేదా నమస్కారం అడుక్కోవడం కోసం చాలామంది సైగ చేస్తారు పలకరిస్తున్నట్లు ఇవన్నీ మనువాద బ్రాహ్మణీయ భావజాలం తాలూకు పోకడలు. ఇగో.. లో భాగం..

డా.అంబేడ్కర్ భిక్షువుకే ప్రశ్న వేసి భిక్షువునే నేర్చుకునేలా పాఠం నేర్పిన జ్ఞాని.నిజమైన జ్ఞాని అయితే నేనేంటీ…నా శిష్యులు దగ్గర నేర్చుకోవడం ఏంటి అనే అహంకారంతో ఉండరు.మన తెలుగు రాష్ట్రాల్లో భిక్షువులు శుభకార్యాలు జరుపుతూ దానం పేరుతో డబ్బులు తీసుకోవడం తప్పితే జనంలోకి వెళ్ళడం లేదు. ఇలా మనం నిజాలు చెబితే ఒక ముఠా తయారు చేసి మనపై దుష్ప్రచారం కూడా నకిలీ భిక్షువులు ఉపాసకులతో ప్రారంభించ గల వాళ్ళు ఉన్నారు.పరిపూర్ణత ,పరిపక్వత లేని వాళ్ళు ,ఏవో బతకడానికి ఇదొక మార్గంగా స్వామిజీలైన పీఠాధిపతులు, మఠాధిపతులు వలె శ్రమ చేయకుండా బతకడం కోసం భిక్షువు అవతారం ఎత్తిన వాళ్ళకి ఇవేమీ రుచించవు.భిక్షువు ఈనాడు బ్రాహ్మణ పురోహితులు పాత్ర పోషిస్తున్నారు. బ్రాహ్మణ పురోహితులు లాగ బౌద్ధ భిక్షువులు ఉండకూడదు నిజానికి.. కానీ మనతెలుగు నాట అలాగే ఉంటున్నారు.

You may also like...

Translate »