చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే సేవలకు గుర్తింపు

చదువుల తల్లి సావిత్రిబాయి ఫూలే సేవలకు గుర్తింపు
- సావిత్రిబాయి పూలే జయంతిని రాష్ట్ర మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం హర్షదాయకం
- బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ మద్దూరి అశోక్ గౌడ్
- సావిత్రీబాయి ఫూలే జయంతిని జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించాలి
- పార్టీలకు అతీతంగా ఎంపిలు కేంద్రం పై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్
జ్ఞాన తెలంగాణ, షాద్నగర్, షాద్నగర్ ప్రతినిధి జనవరి 03:
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే సామాజిక సేవలను ప్రభుత్వం గుర్తించడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, మద్దూరి ఫౌండేషన్ చైర్మన్ మద్దూరి అశోక్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. మహిళల అభ్యున్నతి చదువుతోనే సాధ్యమని మహిళలల్లో అక్షర జ్ఞానాన్ని నింపిన విజ్ఞాన జ్యోతి చదువుల సరస్వతి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమని అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించాలనే చిరకాల డిమాండ్ ను కాంగ్రెస్ ప్రభుత్వం సాకారం చేసిందని, సావిత్రిబాయి మహిళా లోకానికి జ్ఞాన మార్గాన్ని చూపడమే కాకుండా కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు ఎంతగానో కృషి చేశారని కొనియాడారు.. సొంత ఖర్చుతో పాఠశాలలను ఏర్పాటు చేసి బాలికలకు విద్యను అందించిన గొప్ప విద్యా వేత్త అని కొనియాడారు. ఆమె రచనలు దేశ వ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించాయని గుర్తు చేశారు. సావిత్రిబాయి పూలే ధైర్య సాహసాలు ఉద్యమ పోరాట పటిమ మహిళా లోకానికి స్ఫూర్తి దాయకం అని చాటుతూ ప్రభుత్వం జనవరి 3 ను మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించి జీవో విడుదల చేయడం సంతోషకరమని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ అన్ని రాష్ట్రాల్లో జనవరి మూడవ తేదీని మహిళ ఉపాధ్యాయ దినోత్సవం గా జరపాలని కోరుతూప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. వివక్ష, అఘాయిత్యాలు, బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఎన్నో పద్యాలు కవితలతో సమాజంలో అవిద్యను రూపుమాపి, కులాలకతీతంగా అందరికీ విద్యాహక్కును అందించిన గొప్ప మహిళ అభ్యుదయ వాది సావిత్రిబాయి పూలే సేవలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు . పార్టీలకు అతీతంగా ఎంపీలందరూ ఏకమై జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవ ఏర్పాటుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు