అనుమతులున్న విదేశీ వైద్య కళాశాలల్లోనే చేరాలి

అనుమతులున్న విదేశీ వైద్య కళాశాలల్లోనే చేరాలి
విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు తప్పనిసరిగా తమ అనుమతి పొందిన వైద్యకళాశాలల్లోనే సీట్లు పొందాలని జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) స్పష్టం చేసింది. వైద్యవిద్య పాఠ్య ప్రణాళిక, నిర్దేశిత గడువులోగా వైద్యవిద్య పూర్తి, క్లినికల్, నాన్ క్లినికల్ అంశాల్లో శిక్షణ.. తదితర అంశాలపై విదేశాల్లోని వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ స్పష్టమైన మార్గదర్శకాలను సూచించింది. ఆయా దేశాల్లోని కళాశాలలు కూడా భారత వైద్యవిద్యార్థులకు తగ్గట్టుగా ఎన్‌ఎంసీ విధానాలను అమలు చేస్తున్నాయి. కొన్ని దేశాల్లో కొన్ని కళాశాలలు మాత్రం ఈ మార్గదర్శకాలను అమలు చేయడం లేదు. అటువంటి వైద్య కళాశాలల్లో గనుక ఎంబీబీఎస్ వైద్యవిద్యను పూర్తి చేసి భారత్‌కు వస్తే ఇక్కడ ఇంటర్న్‌షిప్ చేయడానికి ఎన్‌ఎంసీ నిబంధనలు అంగీకరించవు. వీటిని దృష్టిలో పెట్టుకొని విదేశాల్లో వైద్యవిద్య అభ్యసించడానికి వెళ్లాలనుకునే విద్యార్థులు ముందుగా ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో సంబంధిత కళాశాలకు అనుమతి ఉందో లేదో చూసుకోవాలని బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.