75 వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు

75 వ భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవ శుభాకాంక్షలు
1947 జూలై 23 న డా.అంబేడ్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైన రోజు :
భారత రాజ్యాంగ పరిషత్తుకు సంబంధించి 1942లో కేబినెట్ సిఫార్సు ఫలితంగా రాజ్యాంగ పరిషత్తుకు 1946 లో ఎన్నికలు జరిగాయి.మొత్తం 389 మంది సభ్యులను కాంగ్రెసు గెలిపించింది. ఈ రాజ్యాంగ పరిషత్తుకు జరిగిన ఎన్నికలను ముస్లిం లీగ్ మహమ్మద్ అలీ జిన్నా నాయకత్వంలో బహిష్కరించారు. ఈ రాజ్యాంగ పరిషత్తుకు కాంగ్రెసు తరపున కాకుండా డా.అంబేడ్కర్ బొంబాయి నుండి పోటీ చేశారు.అంబేడ్కర్ ను ఎన్నికల్లో ఓడించడానికి ప్రాథమిక విద్యను మాత్రమే పూర్తి చేసిన అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకున్నారు.అంబేడ్కర్ ను ఓటమి పాలు చేశారు.దీంతో తూర్పు బెంగాల్ లోని నామశూద్రులు జోగేంద్రనాధ మండల్ నాయకత్వంలో జైసోర్ ,కుల్నా జిల్లాల నుండి గెలిపించి రాజ్యాంగ పరిషత్తుకు డా.అంబేడ్కర్ ను పంపించారు. కాంగ్రెసు, ఆర్. ఎస్.ఎస్.సంస్థలు అంబేడ్కర్ ను రాజ్యాంగ పరిషత్తుకు రాకుండా అడ్డుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలం అయ్యారు.
కాంగ్రెసు, ఆర్ఎస్ఎస్ కుట్రలు:
ఈసారి అంబేడ్కర్ తూర్పు బెంగాల్ నుండి గెలిచారు కాబట్టి సవర్ణులు కొత్త పథకం వేసి అంబేడ్కర్ ను ఎలాగైనా సరే రాజ్యాంగ పరిషత్తుకు రానీయకుండా అడ్డుకోవాలని బెంగాల్ విభజన రెండో దశ పోరాటం ప్రారంభించారు. మొదటి దశలో 1905 లో బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ బెంగాల్ ను పరిపాలనా సౌలభ్యం కోసం రెండు భాగాలుగా చేయాలని ప్రయత్నం చేసినప్పుడు సవర్ణులు కాంగ్రెసు, ఆర్ఎస్ఎస్ సంస్థలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. “మా ప్రాణాలు ఇవ్వడానికి అయినా మేం సిద్ధం బెంగాల్ మాకు కన్నతల్లితో సమానం అలాంటి బెంగాల్ ను విభజిస్తే ఊరుకోం ” అంటూ బెంగాల్ విభజన వలన బ్రిటిష్ వాళ్ళు దేశభక్తిని అణచాలని చూస్తోందని గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అంబేడ్కర్ తూర్పు బెంగాల్ నుండి గెలవడంతో ఇదే సవర్ణులు ఈసారి బెంగాల్ ను విభజించాలని అలా చేయకపోతే మాప్రాణాలు ఇవ్వడానికి అయిన సరే వెనుకాడమంటూ బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. ఎంత ద్వంద్వ వైఖరి, ఎంత కుట్ర ఉందో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. మరో పక్కన ముస్లిం లీగ్ జిన్నా నాయకత్వంలో దేశ విభజన కోరుకుంటుంది.ఇలాంటి తరుణంలో 1946 నాటికి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం ఉధృతమయింది.దీనిని అదనుగా భావించి సవర్ణులు ఏకమై రహస్య సదస్సులు పెట్టుకున్నారు.బెంగాల్ లో దళితులు, ముస్లింలు ఐక్యతను చూసి భవిష్యత్ లో మెజారిటీ జనాభా గల దళితులు ,ముస్లింలు పాలకులు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయని భావించి ముస్లింలు-దళితుల మధ్య మత గొడవలు సృష్టించారు. ఈ మత ఘర్షణలు యొక్క కుట్ర పసిగట్టలేని మన దళితులు ,ముస్లింలు,ఇతరులు బలై పోయారు.1946 లో నౌక్లా జిల్లాలో ఆగస్టు 16 న పదివేల మంది దళితులను ఊచకోత కోసారు.ఈ ఘర్షణలు సాకుగా చూపించి భారతదేశం రెండుగా విభజించారు.బ్రిటిష్ వాళ్ళని కలిసి సవర్ణులు యొక్క ప్రయోజనాలే దేశ ప్రయోజనాలు అన్నట్లుగా చూపించారు. బెంగాల్ లోని నామశూద్రులు మెజారిటీగా ఉన్నారు. వాళ్ళ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకోకుండా దేశ విభజన చేసి బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలను పాకిస్తాన్ లో కలిపేశారు.*
బెంగాల్ విభజన కోసం హిందూ మహాసభ శ్యాం ప్రసాద్ ముఖర్జీ నాయకత్వంలో సురేంద్ర మోహన్ ఘోష్,డా.విద్యా చంద్ర రాయ్ ,కిరణ్ శంకర్ రాయ్ల నాయకత్వంలో కాంగ్రెసు పార్టీ, సిఎ చటర్జీ ,చిత్తబసు నాయకత్వంలో ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ, సతీష్ చంద్ర మజుందార్ ఇతను హిందూ స్తాన్ స్టాండర్డ్ ,ఆనంద బజార్ పత్రికల సంపాదకుడు,అమృత బజార్ పత్రిక సంపాదకుడు తుషార్ కాంగ్ గోష్ ,జ్యోతిబసు, రతన్ లాల్ ,రూప్ నారాయణ్,నళినీ సర్కార్ నాయకత్వంలో కమ్యూనిస్టులు,ఇంకా పలువురు చరిత్ర కారులైన రామనాధ్ సర్కార్, రమేష్ చంద్ర మజుందార్, మఖన్ లాల్ చౌదరి ,సునీత ఛటోపాధ్యాయ ,సుకుమార్ సేన్ లు అందరూ కలిసి బెంగాల్ ను *విభజించాలని పట్టపట్టి తమ కుట్రను,పంతాన్ని నెగ్గించుకున్నారు.

ఇదిలా ఉంటుండగా అంబేడ్కర్, జోగేంద్రనాధ మండల్ నాయకత్వంలో సామాజిక పరివర్తన, రాజకీయ అధికారం కోసం బెంగాల్ లోని దళితులు రాజకీయ అధికారిన్ని కైవసం చఘసుకున్నారు.ఎక్కడ ఈ దళితుల చేతుల్లోకి స్వతంత్ర భారత దేశం పాలనాధికారం వెళ్ళి పోతుందోనని మెజారిటీ దళితులను, ముస్లింలను టార్గెట్ చేసి బెంగాల్ ను విభజించి దేశాన్ని రెండుగా చీల్చారు.ఇంక అంబేడ్కర్ కు రాజ్యాంగ సభకు వెళ్ళే అవకాశం లేకుండా పోయింది.రాజ్యాంగ సభకు ఎన్నికైతేనే భవిష్యత్ లో రాజ్యాంగం వ్రాసే అవకాశం లభిస్తుంది. కాంగ్రెస్ గెలిపించుకున్న అభ్యర్థులు ఎవరూ కూడా బహుజనుల నుండి వచ్చిన వారు కాదు. అందరూ అగ్రకులాల వాళ్ళే.పైగా రాజ్యాంగం రచించే అంత మేధస్సు ఎవరికీ లేదు. ఎలాగైనా సరే అంబేడ్కర్ ను రాజ్యాంగ సభకు పంపించాలని లేదంటే ఈ దేశంలో మెజారిటీ ప్రజలు నష్ట పోతారని జోగేంద్రనాధ మండల్ భావిస్తారు. అంబేడ్కర్ కూడా అదే ఆలోచనతో బాధపడతారు. బ్రిటిష్ వాళ్ళని కలిసి సవర్ణులు కాంగ్రెస్, హిందూ మహాసభ చేస్తోన్న కుట్రలు గురించి జోగేంద్రనాధ మండల్ తదితరులు ఒక బృందంగా వెళ్ళి జరిగినదంతా బ్రిటిష్ గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ కు వివరించారు.బాటన్ కు అంబేడ్కర్ పట్ల కాంగ్రెసు చేస్తోన్న కుట్రలు తెల్సుకున్నారు. బాటన్ కు కాంగ్రెసు పట్ల అసహనం కలిగింది.అంబేడ్కర్ పట్ల హిందూత్వ వాదులు ,కాంగ్రెసు కలిసి మెజారిటీ బహుజనులకు చేస్తోన్న అన్యాయం తెల్సుకుంటారు.దేశానికి స్వాతంత్య్రం మరో రెండు సంవత్సరాలు పాటు వాయిదా వేస్తున్నాం అంటూ వర్తమానం కాంగ్రెసుకు పంపిస్తారు.దీంతోకాంగ్రెసు నాయకులు బ్రిటిష్ వారి దగ్గరకు వెళ్ళి ఇలా అంటారు “మీరు ఏదైనా చేయండి, కావాలంటే స్వాతంత్ర్యం ప్రకటించిన తర్వాత మరో పది సంవత్సరాలు మీరు ఈ దేశాన్ని పాలించుకోండి “అంటూ వేడుకుంటారు.బాటన్ కాంగ్రెసు నాయకులను మీకు ప్రజల సంక్షేమం కన్నా అధికారమే మీకు కావాలని మందలించినట్లుగా చాలా మంది అంటుంటారు.అప్పుడు బాటన్ అంబేడ్కర్ ను రాజ్యాంగ సభకు పంపించమని చెబుతాడు.ఇక చేసేది లేక కాంగ్రెస్ వాళ్ళు మహారాష్ట్ర ముఖ్యమంత్రి బి.జి.కేర్ కు చెప్పి మహారాష్ట్ర నుండి ఎమ్.ఆర్.జయకర్ ను రాజీనామా చేయించి అంబేడ్కర్ ను ఆ స్థానంలో గెలిపించారు.బొంబాయి నుండి అంబేడ్కర్ రాజ్యాంగ సభకు ఎన్నికైనారు.అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం 1947 ఆగస్టు 15 న స్వాతంత్ర్యం ప్రకటించింది.కాంగ్రెస్ వాళ్ళు కేవలం తమ రాజకీయ పదవులు పొందడానికి స్వాతంత్ర్యం అవసరం కాబట్టే బ్రిటిష్ వాళ్ళు మందలించడంతో అంబేడ్కర్ ను రాజ్యాంగ పరిషత్తుకు పంపించారు. అంబేడ్కర్ గారు కనుక రాజ్యాంగ పరిషత్ లో ఉండి ఉండకపోతే ఈ దేశానికి స్వాతంత్ర్యం లభించకపోయి ఉండేది.కాంగ్రెసు ,హిందూ మహాసభలు దళితులను, ముస్లింలను ఎలాగైనా బానిసలను చేయాలని చూశారు.రాజకీయ అధికారం అందకుండా అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.

🇮🇳భారత రాజ్యాంగం 1949 వ సంవత్సరం నవంబర్ 26 వ తేదీన ఆమోదం పొందింది.డా.బి.ఆర్.అంబేడ్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు ఎంతో శ్రమించి నూతన రాజ్యాంగం మనకు అందించారు.భారత రాజ్యాంగంలో 76౦౦ సవరణలు వచ్చాయి.దీనిలో నుండి 2473 సవరణలు తొలగించబడ్డాయి.1950 జనవరి 26 న అంబేడ్కర్ భారత రాజ్యాంగాన్ని సభకు సమర్పించారు.ఈ సందర్భంగా అంబేడ్కర్ గారు ఎంతో ఆవేదనతో మన దేశ భవిష్యత్ గురించి చెప్పిన మాటలను ఎవరూ పట్టించుకోవడం లేదు. అంబేడ్కర్ ఆవేదనతో ఇలా అన్నారు ” ఈ రోజు నుండి మనం వైరుధ్యాలతో నిండిన జీవితంలోకి ప్రవేశించబోతున్నాము.రాజకీయాల్లో సమానత్వాన్ని కలిగి ఉంటాము,కానీ సామాజిక,ఆర్థిక రంగాల్లో అసమానత ఉంటుంది. మనం ఈ వైరుధ్యాన్ని త్వరలో అధిగమించాలి,లేకుంటే ఎవరైతే ఈ అసమానత నుండి బాధపడతారో,వారు,రాజ్యాంగ పరిషత్తు చాలా కష్టపడి నిర్మించుకున్న ఈ రాజకీయ ప్రజాస్వామ్యాన్ని కూల్చివేస్తారు.”
అనారోగ్యంతో డా.అంబేడ్కర్ ఎంతగానో శ్రమించి భారత రాజ్యాంగం అందించారు.1948 చివరివారానికల్లా రాజ్యాంగం చిత్తు ప్రతిని పూర్తి చేసారు. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షునికి ఈ చిత్తు ప్రతిని అందచేయగా దేశ ప్రజల అభిప్రాయం తెలుసుకొనేందుకు చర్చలు జరపడానికి 8 నెలల కాలం పట్టింది.పేరుకే రాజ్యాంగ రచనా కమిటీకు 8 మంది సభ్యులు ఉన్నారు కానీ ఏ ఒక్కరూ అంబేడ్కర్ తో కలిసి రాజ్యాంగ రచన చేయడానికి కలిసి రాలేదు. ఒక్క అంబేడ్కర్ మాత్రమే రాజ్యాంగం రచించారు.1947 లో సుమారు 15 రోజులు కంటిమీద కునుకు లేకుండా అంబేడ్కర్ రచించారు.అనారోగ్యంతో ఉన్న అంబేడ్కర్ అసుపత్రికి వెళ్ళకుండా రాజ్యాంగ రచన చేశారు. అంబేడ్కర్ కు మధుమేహం, కాళ్ళ నొప్పులు ఇంత బాధతో కూడా అంబేడ్కర్ సంతోషంగా మనదేశం కోసం రాజ్యాంగ రచన భారాన్ని తన భుజంపై మోసారు.వైద్యం కోసం ఆసుపత్రికి వెళితే రాజ్యాంగ రచన పని ఆగిపోతుంది అని ఇంట్లోనే ఇన్సులేషన్ వేయించుకొంటూ హోమియో వైద్యంతో అంబేడ్కర్ పనిచేశారు.1948 నవంబర్ 4 రాజ్యాంగ చిత్తుప్రతిని రాజ్యాంగ పరిషత్తు ముందు ఉంచారు.
1946 లో అంబేడ్కర్ భారత రాజ్యాంగ సభకు ఎన్నియ్యారు.ఆ తర్వాత డ్రాప్టింగ్ కమిటీకు ఎన్నియ్యారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ చెప్పిన మాటలను మనందరం మననం చేసుకోవాలి.డా.అంబేడ్కర్ ఇలా మాట్లాడారు : “మనమంతా అనేక కులాలుగా విడిపోయి ఉన్నప్పటికీ మనదేశం సమైక్యంగా ముందుకు సాగుతుందనడంలో నాకెలాంటి సందేహం లేదు.”
బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ రాజ్యాంగ రచన సమయంలో అనారోగ్యంతో ఉన్నప్పుడు డా.సవితా కబీర్ వైద్య సేవలందించారు. ఇలాంటి సమయంలో అంబేడ్కర్ తనకు మొదటి భార్య అప్పటికే కాలం చేయడంతో , తనను చూసుకోవడానికి, మరొక వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు.1948 ఏప్రిల్ 15 న ఇంట్లోనే పౌర వివాహాల చట్టం కింద డిప్యూటీ కమీషనర్ సమక్షంలో నమోదు చేసుకొన్నారు. కేవలం 15 మంది సన్నిహితులు మధ్య అంబేడ్కర్ వివాహం చేసుకున్నారు.అంబేడ్కర్ కు వైద్య సేవలు చేసిన సవితా కబీర్ ధన్యురాలు.
డా.అంబేడ్కర్ ఒక్కరే రాజ్యాంగం రచించారు:
చాలామంది అంబేడ్కర్ ఒక్కరే రాజ్యాంగం రచించారు అని ఒప్పుకొంటారు.ఈ మధ్య కొందరు కావాలని అంబేడ్కర్ ఒక్కరే రాజ్యాంగం వ్రాయలేదంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు.భారత రాజ్యాంగ రచనా కమిటీలో సభ్యుడు టి.టి. కృష్ణమాచారి మాటలను మనందరం గమనించాలి.” సభ రాజ్యాంగ కమిటీకి ఏడుగురు సభ్యులు నియమించింది. అయితే ఒక సభ్యుడు ముందే రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో మరొకర్ని యిచ్చారు. ఇంకో సభ్యుడు చనిపోయినప్పటికీ ఆయన స్థానాన్ని పూరించలేదు.ఇంకో సభ్యుడు అమెరికాలో ఉండిపోయారు. ఆ స్థానమూ అట్లాగే ఉండిపోయింది. మరో సభ్యుడు ప్రభుత్వ ప్రభుత్వ వ్యవహారాల్లో తలమున్కలై ఉండేవారు. ఇంకొకరిద్దరు ఎప్పుడూ ఢిల్లీకి దూరంగా ఉండేవారు. అనారోగ్య కారణాల వాళ్ళు తరచూ హాజరు కాలేకపోయారు.తత్ఫలితంగా మొత్తం భారమంతా డా.అంబేడ్కర్ పైనే పడింది. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ఆయన అనితర సాధ్యంగా పూర్తి చేశారు ఆయన ఎంతైనా అభినందనీయులు. ఆ విధంగా మన రాజ్యాంగ రచన ఏక వ్యక్తి కృషితో సాగింది. ఆ ఏకైక వ్యక్తి డా.అంబేడ్కర్ కావడం విశేషం.”

భారత రాజ్యాంగ రచన సమయంలో అంబేడ్కర్ అహోరాత్రులు శ్రమించారు. విస్తృతంగా పుస్తకాలు అధ్యయనం చేశారు. రాత్రి పూట కాళ్ళు విపరీతంగా నొప్పులు రావడంతో అంబేడ్కర్ తన కాలికి తాడు కట్టుకొని ఇంటి పైకప్పునకు ఉన్న సీలింగ్ ఫ్యాన్ కు తాడు కట్టుకొని నిద్ర రాకుండా ఉండటానికి ఆ విధంగా చేశారు. పట్టుదల, అంకితభావంతో, భారతదేశం కోసం అంబేడ్కర్ ఎంతగానో తపించారు.
భారత స్వతంత్ర్య భారతదేశంలో అంబేడ్కర్ తొలి న్యాయశాఖ మంత్రిగా సేవలందించారు.
నెహ్రూ, పటేల్ లు స్వతంత్ర్య భారతదేశానికి రాజ్యాంగం కావాలని అంతర్జాతీయ రాజ్యాంగ నిపుణుడు సర్ ఐవర్ జెన్నింగ్స్ ను పిలిచి భారత రాజ్యాంగం రచించే బాధ్యతలు అప్పజెప్పాలని అనుకున్నారు. అయితే ఐవర్ జెన్నింగ్స్ “భారత రాజ్యాంగ రచన చేయగల సమర్థుడు,అసాధారణ న్యాయ, రాజ్యాంగ కోవిదుడైన డా. అంబేడ్కర్ మీ దేశంలో ఉండగా బయటి వాళ్ళకి ఎందుకు అప్పగించడం ‘ అని ఆయన అన్నారు.1949 నవంబర్ 26 న భారత ప్రజల తరపున భారత రాజ్యాంగం ఆమోదించబడింది.అంతకు ముందు ఉన్న హిందూ బ్రాహ్మణ మనుస్మృతి భారతీయ ప్రజలకు మానవ హక్కులను కూడా కల్పించలేదు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ,సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని అందించింది. వేల సంవత్సరాల దోపిడీ, అన్యాయం, అణచివేతలను అంతం చేసింది. స్త్రీలకు విముక్తి కల్పించింది.”భారత రాజ్యాంగం ఒకవేళ దుర్వినియోగం అయితే దాన్ని తగులబెట్టేవాళ్ళలో మొదటివాడిని నేనే” అని అంబేడ్కర్ ప్రకటించారు.భారత రాజ్యాంగం గనుక సరిగ్గా అమలు జరిగితే ప్రపంచ దేశాల్లో మనదేశం అగ్రగామిగా నిలబడటం ఖాయం.అయితే నేటి రాజకీయ పార్టీలకు,పాలకులకు చిత్తశుద్ధి లేదు.

భారత రాజ్యాంగం,డా.అంబేడ్కర్ గురించి అంతర్జాతీయ రాజనీతిజ్ఞుడు గ్రాస్ విల్లీ ఆస్టీన్ ఇలా అన్నారు “భారత రాజ్యాంగం గొప్ప చరిత్రాత్మక సామాజిక పత్రం.”
బొంబాయి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చాగ్లా మాట్లాడుతూ ” తమ ప్రాథమిక హక్కులను అనుభవిస్తున్నప్పుడల్లా ప్రతి భారతీయులు డా. బి.ఆర్. అంబేడ్కర్ పేరు ఘనంగా గుర్తు పెట్టుకుంటారు.”
భారత రాజ్యాంగాన్ని మీరు కాపాడుకుంటేనే భారత రాజ్యాంగం మిమ్మల్ని కాపాడుతుంది.బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ఈ విధంగా చెప్పారు :
“However good a Constitution may be, if those who are implementing it are not good, it will prove to be bad. However bad a Constitution may be, if those implementing it are good, it will prove to be good.”
"రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేస్తున్న వారు మంచివారు కాకపోతే, అది చెడ్డదని రుజువవుతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా, దానిని అమలు చేసేవారు మంచివారైతే, అది మంచిదని రుజువు అవుతుంది."

అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది