నిజమైన స్నేహితులు, శత్రువులు గురించి భగవాన్ బుద్ధుడు ఏం చెప్పారు..?

స్నేహితులు లాగ కనబడుతూ శత్రువులు నాలుగు రకాల వాళ్ళు ఉంటారని భగవాన్ బుద్ధుడు సిగాలుడు అనే గృహస్తునికి ఈ విధంగా వివరించారు :
1.దోపిడీ మనస్తత్వం గల వాళ్ళు, 2.మాటలు అధికం, 3.చేతలు శూన్యం అయిన వాళ్ళు, 4.పొగడ్తలతో ప్రొద్దు పుచ్చు వాళ్ళు,వృథాగా కాలాన్ని గడిపే వాళ్ళు..
మొదటి రకం దోపిడీ మనస్తత్వం గల వాళ్ళు నిజానికి మనకు శత్రువులు..ఎందుకంటే ఈ దోపిడీ మనస్తత్వం గల వాళ్ళు మనకు ఇచ్చేది ఏమీ ఉండదు.. కానీ మన దగ్గర నుండి మాత్రం కొండంత తీసకొని పోగలరు. ఇలాంటి వాళ్ళు భయం వల్ల తమ విధిని నిర్వర్తిస్తారు..అయితే వీళ్ళ దృష్టి స్వప్రయోజనాలపైనే ఉంటాయి.
రెండవ రకం వాళ్ళు మాటల అధికం… చేతల్లో శూన్యం…ఇలాంటి వాళ్ళు స్నేహితులు వలె ఉంటారు.. అయితే వీళ్ళు గతంలో తన స్నేహితులకు ఎంతగానో తోడ్పడ్డానని భవిష్యత్తులో కూడా తన స్నేహితులకు ఎంతో ఉపయోగపడగలననీ మాటలు చెప్పుకొంటారు.అవసరం వచ్చినప్పుడు స్నేహితులకు ఏమీ సాయం చేయకపోగా తప్పించుకు తిరుగుతారు .
మూడవ రకం స్నేహితులు అస్తమానం నిన్ను పొగుడుతుంటారు.చేయవలసిన దానిని చేయవద్దని చెప్పేవాళ్ళు.. ఇతరుల దగ్గర నిన్ను తిడతారు..ఇలాంటి వాళ్ళు స్నేహితులు కానేకదని గుర్తించాలి..\

నాలుగో రకం స్నేహితులు పిచ్చాపాటి కబుర్లు చెప్పుతూ సమయాన్ని వృథాగా గడిపేవాళ్ళు.సమయం లేకుండా వీధుల వెంట రాత్రుళ్ళు త్రిప్పుతారు.నిన్ను వినోదాలలో, జూదాలలో పాల్గొనేలా చేయగలురు..ఇలాంటి స్నేహితులు మనకు అనవసరం గుర్తించాలి.
భగవాన్ బుద్ధుడు సిగాలునికి హృదయపూర్వకంగా స్నేహితులుగా గుర్తించ దగిన వాళ్ళు నలుగురు ఉన్నారు అని ఈ విధంగా వివరించారు :
1.సహాయకారి,2. కలిమి లేముల్లో కూడా కలిసి ఉండేవారు,3. సరియైన సలహా ఇచ్చువారు, 4.అవసర కాలంలో సానుభూతి చూపువారు..
మనం అజాగ్రత్తగా ఉన్నప్పుడు మొదటి రకం సహాయకారి అయిన వాళ్ళు మన పట్ల జాగ్రత్తగా ఉంటూ మన ఆస్తిపాస్తులు కాపాడుతారు. మనకు ప్రమాదాలు సంభవించినప్పుడు మనకు రక్షణగా నిలుస్తారు.మన కార్యకలాపాల నిర్వహణలో మనకు రెండింతలు తోడ్పటును అందిస్తారు. ఇలాంటి వాళ్ళే నిజమైన మన స్నేహితులు..
రెండో రకం స్నేహితులు మన కలిమి లేముల్లో కలిసి ఉంటారు.ఎలాంటి దాపరికం లేకుండా తన యొక్క రహస్యాలు కూడా నీకు చెప్పేస్తారు.మన యొక్క రహస్యాలు అస్సలు బయటకు పొక్కనీయరు.మనకు కష్టాలు వచ్చినప్పుడు అస్సలు మనల్ని విడిచిపెట్టి వెళ్ళరు. నీకోసం అవసరం అయితే తన ప్రాణాలు సైతం లెక్కచేయరు.
మూడో రకం స్నేహితులు సరియైన సలహాలు ఇస్తారు. ఏది ఎలా ఉచితం, ఏది ఎందుకు అనుచితం అనేది నీకు తెలుపుతారు.నీకు ఇంతవరకు తెలియని విషయాలు తెలియచేస్తారు.ఒకే ఒక్క మాటలో వీళ్ళ గురించి చెప్పాలంటే స్వర్గానికి దారులు వేసేవాళ్ళు.ఇలాంటి వాళ్ళు హృదయపూర్వకమైన స్నేహితులు..
నాలుగో రకం స్నేహితులు సానుభూతి చూపువారు. వీళ్ళు హృదయపూర్వకమైన స్నేహితులు.మనం కష్టాలు పాలైనప్పుడు వీళ్ళు సంతోషంగా ఉండలేరు. మనకు అదృష్టం కలిసి వస్తే ఎంతగానో సంతోషపడతారు. మన గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే వాళ్ళని ఎదిరిస్తారు. మన గురించి మంచిగా మాట్లాడే వారిని ఆదరిస్తారు.

- అరియ నాగసేన బోధి
MA.,M.Phil.,TPT.,LL.B
బౌద్ధ ఆచరియ & న్యాయవాది
–
