ఉద్యోగం ఒకరిది..ఊడిగం మరొకరిది

ఉద్యోగం ఒకరిది..ఊడిగం మరొకరిది
-విద్యుత్ లైన్లు సరి చేయబోయి ఒకరికి ప్రమాదం
జ్ఞాన తెలంగాణ, మొగుళ్లపల్లి విద్యుత్ శాఖలో కరెంట్ సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా సరి చేసేందుకు నియమించిన జేఎల్ఎంలు తమకు అసిస్టెంట్లుగా ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని పనులు చేయిస్తున్న ఉదాంతం ఇది. ఒక ప్రైవేట్ వ్యక్తికి జేఎల్ఎం ఫోన్ చేసి వ్యవసాయ విద్యుత్ సరఫరాను సరిచేయాలని పిలిపించగా ఆ వ్యక్తి విద్యుత్ షాక్ కు గురై తీవ్రంగా కాలిపోయి ప్రమాదం బారిన పడ్డాడు. ఈ సంఘటన మొగుళ్లపల్లి మండలం ముల్కలపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. ఆ గ్రామానికి జేఎల్ఎంగా పనిచేస్తున్న రమేష్ అనే ఉద్యోగి ప్రైవేట్ ఎలక్ట్రిషన్ అయిన ప్రసాద్ అనే వ్యక్తిని పిలిపించి స్తంభం ఎక్కించాడు. పైకి ఎక్కిన అతను విద్యుత్ సరఫరాను పునరుద్ధరించే చర్యలు చేపట్టగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా జరిగి స్థంభం పైనుంచి పడిపోయాడు. అప్పటికే అతని శరీరం అంతా చాలా మేరకు కాలిపోయింది. వెంటనే అతనిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ వైద్యులు పరిస్థితి విషమించిందని హైద్రాబాద్ కు తీసుకుపోవాలని చెప్పారు. ఈ క్రమంలో అతడిని హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉందని బంధువులు తెలిపారు. ఈ సంఘటనపై గ్రామ తాజా మాజీ సర్పంచ్ చదువు అన్నారెడ్డి విచారం వ్యక్తం చేశారు.