అంకిత భావం, సేవా భావంతో పనిచేసి అమరుల త్యాగాలకు స్వార్థకతను చేకూర్చాలి: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా.

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు.

*అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి, గౌరవ వందన స్వీకరించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్.

జ్ఞాన తెలంగాణ భూపాలపల్లి ప్రతినిధి:

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని
ఆదివారం జిల్లా కేంద్రంలోని అమర వీరుల స్థూపానికి, ప్రొఫెసర్ జయశంకర్ జయశంకర్ విగ్రహానికి ఎస్పి కిరణ్ ఖరే తో కలిసి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సమీకృత కలెక్టర్ కార్యాలయంలో
పోలీసులచే గౌరవ వందన స్వీకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ప్రజలను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రం
ఆవిర్భవించి నేటితో పదేండ్లు నిండాయని అన్నారు. ఈ రోజు జిల్లా అంతటా దశాబ్ది వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. స్వరాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమర వీరులందరికీ ఘనంగా నివాళులు అర్పించారు. ఎందరెందరో అమర వీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దశదిశలా వెలుగులు విరజిమ్ముతూ దేశంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోందని అన్నారు. ఈ సందర్భంగా అమరుల కుటుంబాలకు, ఉద్యమ కారులకు, స్వరాష్ట్ర సాధన పోరాటంలో పాలుపంచుకున్న చిన్నా, పెద్దలందరికీ పేరు పేరునా ప్రణామాలు తెలిపారు

పరిపాలనలో పారదర్శకతతో పాటు ప్రజలకు జవాబు దారీగా ఉండే ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పామని, దీంతో ప్రజలు పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో ప్రజాస్వామిక శకం ఆరంభమైందని అన్నారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించించామని అందులో భాగంగానే గత సంవత్సరం డిసెంబర్ 28 నుండి ఈ సంవత్సరం జనవరి 6 వరకు సరికొత్తగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి 241 గ్రామ పంచాయతిల్లోను, భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని ప్రజల నుండి లక్షా 30 వేల దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. దరఖాస్తులు స్వీకరణకు ప్రభుత్వ అధికారులను ప్రతి పల్లె పల్లెకు, ప్రతి బస్తీకి పంపించి గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. సంక్షేమ పథకాలకు అర్హులైనవారందరి నుండి ధరఖాస్తులు చేసుకోవాలని ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించామని అన్నారు.

ఆరు గ్యారంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 48 కోట్ల 76 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ప్రయాణ ఛార్జీల భారం తగ్గిపోవటంతో దాదాపు 1685 కోట్లు మహిళలు ఆదాచేసుకున్నట్లయిందన్నారు. ప్రజల ఆరోగ్య సేవలకు ప్రభుత్వం అత్యంత ప్రాధానమిచ్చిందని, ఇందుకు ఆరోగ్య శ్రీ పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచ్చినట్లు తెలిపారు. ఈ పధకానికి డిసెంబర్ 9వ తేదీ నుండి ఇప్పటి వరకు 2 లక్షల 81 వేల 960 మంది ఆరోగ్య శ్రీ వైద్య సేవలను అందుకున్నారని, దాదాపు 659 కోట్ల మేరకు ప్రభుత్వం వైద్య సేవలకు ఖర్చు చేసినట్లు ఆయన వివరించారు.

అర్హులైన పేద కుటుంబాలకు ఉచిత గృహ విద్యుత్తును అందించే గృహ జ్యోతి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందని, ఈ పధకానికి 200 యూనిట్లలోపు విద్యుత్తు వాడే గృహ వినియోగ దారులందరికీ జీరో బిల్లులు జారీ చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నుండి ఇప్పటి వరకు 42 లక్షల 48 వేల కుటుంబాలకు ప్రతి నెలా ఉచితంగా గృహ విద్యుత్ ను అందించినట్లు తెలిపారు. ఈ జీరో బిల్లులకు ప్రభుత్వం 333 కోట్లు సబ్సిడిగా చెల్లించినట్లు
తెలిపారు. మహాలక్ష్మి పథకంలో 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ పంపిణీ చేసే పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని, దీనివల్ల వంటింటి మహిళలపై పడే ఆర్థిక భారాన్ని తగ్గించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 41
లక్షల 73 వేల కుటుంబాలు లబ్దిపొందాయన్నారు. దాదాపు 110 కోట్లు సబ్సిడి భారాన్ని ప్రభుత్వం బరించినట్లు తెలిపారు. నియోజకవర్గానికి ప్రభుత్వం 3 వేల 500 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 29 వేల 384 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని, వీరిలో 53 శాతం పురుషులు, 47 శాతం మహిళలు ఉన్నారన్నారు. మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు, పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు, టిజిపిఎస్సీ, సాంఘిక సంక్షేమ గురుకుల సొసైటీ ఈ నియామకాలు చేపట్టాయన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 9వ తేదీన జరుగనున్న గ్రూప్ 1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు.

తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలను రూపొందిస్తోందని, రైతుల సంక్షేమానికి, వ్యవసాయ పురోగతికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తోందన్నారు. రైతు భరోసా, రైతుల రుణమాఫీ పథకాల అమలుతో పాటు వ్యవసాయ కమిషన్ ఏర్పాటు దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు సాగులో మెళకువలు పాటించి డిమాండ్ ఉన్న పంటల సాగు చేపట్టేందుకు వినూత్నంగా రైతు నేస్తం కార్యక్రమం చేపట్టామని, జిల్లాలోని రైతు వేదికల్లో రైతులు వీడియో కాన్ఫరెన్సు ద్వారా నేరుగా రాష్ట్ర అధికారులు, వ్యవసాయ నిపుణులతో ముఖాముఖి మాట్లాడే ఏర్పాట్లు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు మౌలిక సదుపాయాలు కల్పన పనులు చేపట్టామని అన్నారు. జిల్లాలోని 422 పాఠశాలల్లో 16 కోట్లతో చేపట్టిన పనులు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. అన్ని పాఠశాలల్లో అమ్మ ఆదర్శ కమిటీలు ఏర్పాటు చేసి, పాఠశాలలు పున:ప్రారంభానికి ముందే జిల్లా అంతటా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి బడిలో చదివే పిల్లల తల్లుల భాగస్వామ్యాన్ని పెంచడం ద్వారా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నామని అన్నారు. పాఠశాలల్లో అవసరమైన పనులన్ని గ్రామాల్లోని స్వయం సహాయక మహిళా సంఘాలతో చేయిస్తున్నామని, పిల్లల యూనిఫామ్ ను కుట్టించే పనులను వారికే అప్పగించినట్లు తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక చేయూతను అందించే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు.

శాసనసభ, పార్లమెంటు, శాసనమండలి ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని, ఈ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేస్తున్నామని అన్నారు. కొద్ది రోజుల్లో ఎన్నికల కోడ్ ముగియనున్న నేపథ్యంలో మనందరం పరిపాలనకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మారుమూల ప్రాంతాలు
నిరుపేదలు, నిరక్ష్యరాస్యులు అధికంగా ఉన్న మన జిల్లాలో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అందరం సీనియర్, జూనియర్ అన్న తేడా లేకుండా గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని, అంకితభావం, సేవా భావంతో పనిచేసి అమరుల త్యాగాలకు సార్థకతను చేకూర్చుదామని ఈ సందర్భంగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వాములైన ప్రజలను, అధికారులను, అనధికారులను పాత్రికేయులను ఈ సందర్భంగా అభినందించారు.
తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాడిన తెలంగాణ ఉద్యమ పాటలు ఆహూతులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అన్ని శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »