సాలూర పిహెచ్ సీ లో సమయపాలన ఉండదు..


–పీహెచ్సీలో రోగులకు తాగునీరు కరువే.
ఫోటో. సమయానికి వైద్య సిబ్బంది రాక ఖాళీగా ఉన్న కుర్చీలు.
— తాగునీరు లేక వృధాగా ఉన్న సిస్టం.
జ్ఞాన తెలంగాణ- బోధన్
సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. రోగులకు 24 గంటల పాటు వైద్య సేవలు అందించవలసిన ఈ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఇష్టరాజ్యంతో సమయపాలన పాటించకుండా విధులకు హాజరవుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు విధులలో ఉండవలసిన వైద్య సిబ్బంది 10:30 తర్వాత తాపీగా విధులకు హాజరవుతుండడంతో రోగులు వారికోసం నిరీక్షించవలసి వస్తుంది. వైద్య సిబ్బంది పనులను పర్యవేక్షించవలసిన సూపర్వైజర్లు కూడా సమయపాలన పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం గమనార్హం. సోమవారం నవ తెలంగాణ సాలూరు పి ఎస్ సి ని పరిశీలించగా 10:30 అయిన వైద్య సిబ్బంది విధులకు హాజరు కాలేదు. ఒకే ఒక ఏఎన్ఎం 9 గంటలకు విధులకు హాజరై విధులలో చేరారు. 10:30 వరకు మిగిలిన ఏ ఒక్కరు కూడా ఆస్పత్రి విధులకు రాలేదు. ఇద్దరు సూపర్ వైజర్లు ఉన్న సమయానికి రాకపోవడంతో కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. 10:30 తర్వాత జూనియర్ అసిస్టెంట్ శ్రీకాంత్, డాటా ఆపరేటర్ విజయ్, ల్యాబ్ టెక్నీషియన్ మాత్రమే వచ్చారు. ఆసుపత్రిలో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో తెలియకుండా పోతుందని గ్రామస్తులు అంటున్నారు. అలాగే మరో ఏఎన్ఎం సక్రమంగా విధులకు హాజరు కాకుండా తాను ఉన్నచోట నుండి విధి నిర్వహణ చేస్తున్నట్లు సమాచారం. అయినా కూడా ఎవరు పట్టించుకోవడంలేదని విమర్శలు వస్తున్నాయి. నిత్యం సుమారు 100 మంది వరకు రోగులు ఆసుపత్రికి రాకపోకలు సాగిస్తుంటారు. అత్యవసరంగా మందులు వేసుకునే వారికి కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉండడం లేదు. చల్లని తాగునీరు అందించే ఏర్పాటు ఉన్న అందులో తాగునీరు లేకపోవడంతో వృధాగా మారింది. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఆస్పత్రి నిర్వహణపై దృష్టి సారించాలని, సమయపాలన పాటించని వైద్య సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు.

You may also like...

Translate »