పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి

పాఠశాలల ప్రారంభంలోగా పనులు పూర్తి చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి
మే 29, 2024:
అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మత్తు పనులను వేగవంతం చేసి పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తివారి అన్నారు. బుధవారం జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి, మరమ్మత్తు పనులను జిల్లా విద్యాధికారి అశోక్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలలో పూర్తి సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య బోధన అందించేందుకు ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాలైన త్రాగునీరు, విద్యుదీకరణ, మూత్రశాలలు, ఇతర మరమ్మత్తు పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రతి రోజు మండల విద్యాధికారులు, మండల నోడల్ అధికారులు తమ పరిధిలో ప్రతి పాఠశాలను సందర్శించి పనుల పురోగతిపై పర్యవేక్షించాలని, యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని తెలిపారు. ప్రణాళిక ప్రకారంగా పనులు చేపట్టి 100 శాతం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు తమ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ప్రతిరోజు నివేదిక అందించాలని, క్షేత్రస్థాయిలో ఏదైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అనంతరం నజ్రుల్ నగర్ లో ఏర్పాటు చేసిన ఏకరూప దుస్తుల కేంద్రాన్ని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్ తో కలిసి సందర్శించారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని, విద్యార్థినీ, విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఏకరూప దుస్తులను సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు. స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా వారికి అవకాశం కల్పిస్తూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని, తద్వారా మహిళలకు ఉపాధి కల్పించడం జరిగిందని తెలిపారు. దుస్తుల తయారీ పురోగతిపై ఏ.పి.ఎం.లు, సి.సి.లు ప్రతిరోజు పర్యవేక్షించాలని, రోజువారి లక్ష్యాలను సాధించే దిశగా చర్యలు తీసుకోవడంతో పాటు తయారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి, ఇంజనీరింగ్ అధికారులు, ఎ.పి.ఎం., సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయడమైనది