SRH vs PBKS: అందుకే రాహుల్ త్రిపాఠిని తీసుకున్నాం- కమిన్స్

ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. లీగ్ దశలో ఇరు జట్లకు ఇదే చివరి మ్యాచ్. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో టాప్-2లో చోటు సంపాదించాలని కసిగా బరిలోకి దిగుతోంది. మరోవైపు కీలక ఆటగాళ్లు దూరమై బలహీనంగా ఉన్న పంజాబ్ కింగ్స్ గెలుపుతో సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.
15 పాయింట్లు సాధించి ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ టాప్-2లో నిలవాలంటే పంజాబ్‌పై నెగ్గడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై కూడా ఆధారపడాల్సి ఉంది. క్వాలిఫయిర్-1కు ఎస్ఆర్హెచ్ అర్హత సాధించాలంటే ఇవాళ జరగనున్న మరో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ తప్పక విజయం సాధించాలి. కేకేఆర్ (19), రాజస్థాన్ (16) కూడా ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిన విషయం తెలిసిందే.
మరోవైపు 13 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్ కింగ్స్ అయిదు విజయాలు సాధించింది. పది పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉంది. ఈ పోరులో నెగ్గి గుజరాత్ టైటాన్స్‌ను వెనక్కి నెట్టి ఎనిమిదో స్థానంతో సీజన్‌ను ముగించాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. కాగా, శిఖర్ ధావన్, సామ్ కరన్ దూరం కావడంతో జట్టు బాధ్యతలను జితేశ్ శర్మ అందుకున్నాడు. టాస్ గెలిచిన జితేశ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
అనంతరం జితేశ్ శర్మ మాట్లాడుతూ.. ”పిచ్ బ్యాటింగ్‌కు అనూకలంగా ఉందనిపిస్తుంది. భారీ స్కోరు సాధించి సన్‌రైజర్స్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. పంజాబ్ కింగ్స్‌కు నాయకత్వం వహించడం ఎంతో గర్వంగా ఉంది. మా విదేశీ ప్లేయర్లు జట్టుకు దూరమయ్యారు. ఎంతో ప్రతిభ ఉన్న ఆటగాళ్లు మా దగ్గర ఉన్నారు. వాళ్లకు ఇవాళ అవకాశం దక్కింది. ఇవాళ మేం కోల్పోయేది ఏం లేదు. కాబట్టి మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం” అని అన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ.. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో అదనపు బ్యాటర్‌ను తీసుకున్నామని చెప్పాడు. బౌలర్ స్థానంలో రాహుల్ త్రిపాఠి జట్టులోకి వచ్చాడని పేర్కొన్నాడు.