కనుమరుగు కాబోతున్న మొదటి తరం రాజకీయం

Image Source | Youth In Politics
కనుమరుగు కాబోతున్న మొదటి తరం రాజకీయం
భారతదేశం లాంటి గొప్ప దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పై నడుస్తున్న రాజకీయాలలో అమ్ముడు కొనుడు,ఎత్తులు పై ఎత్తులు, గెలుపు ఓటములు, సంప్రదింపులు, బుజ్జగింపులు, పగలు ప్రతీకారాలు, చేరికలు రాజీనామాలు సర్వసాధారణం.రాజకీయాలలో శాశ్వత బంధాలుండవనే విషయం అందరికీ తెలిసిందే.
కానీ ఇవన్నీ అవకాశవాద రాజకీయాలలో, అధికారం కోసం పాకులాడే రాజకీయాలలో మాత్రమే కనిపిస్తుంటాయి ఆశయం కోసం, సిద్ధాంత ప్రాతిపదికగా చేసే రాజకీయాలలో ఎన్ని అవాంతరాలు ఎదురైన కేవలం పోరాటం మాత్రమే కనిపిస్తుంటుంది.గొప్ప గొప్ప సిద్దాంతాలు మన సమాజంలో ఉన్నా, ఇన్నాళ్ళ మన దేశ రాజకీయాల్లో మన మొదటి తరం నాయకులు చేసిన,చేస్తున్న రాజకీయాలన్ని అవకాశవాద పునాదులుగా సాగినవే.అందుకే ఏ నేత ఒకపట్టాన ఒక రాజకీయ వేదిక మీద నిలబడలేక పోయారు అధికారం చేజారుతుందన్న ప్రతిసారి వ్యభిచార రాజకీయాలకు జై కొట్టుకున్నారు అధికార ఆశతో మన తరాలకు మన భావితరాలకు స్వచ్ఛమైన రాజకీయాలను చూపించలేకపోయారు.ఈ కోవలో కవులు కళాకారులు గాయకులు రచయితలు ఉన్నారని చెప్పడం ఒకింత బాధాకరం ఇలా కలను అమ్ముకున్న కళాకారులు కోకొల్లలు.అందుకే నేటికి మన యువత రాజకీయాలు చేయాలనుకున్న ఎక్కడ చేయాలో ఏ వేదిక సరైనదో అర్దం కాని చదరంగంలా రాజకీయాలు మారిపోయాయి కాదు మార్చేశారు.

గువ్వల బాలరాజ్, బాల్క సుమన్, గ్యాదరి కిషోర్, తాటికొండ రాజయ్య, మొతుకుపల్లి నర్సింహ, కడియం శ్రీహరి, గుండురూ రాములు, వివేక్ వెంకటస్వామి, రసమయి బాలకిషన్, ఏపూరి సోమన్న, దివంగత సాయి చందు ఇంకా చాలా మంది నేతలు మన సమాజం నుండి మెరిసిన రాజకీయ నేతలు. వీరు రాష్ట్ర,దేశ రాజకీయాల్లో తమ పేరును ప్రజాప్రతినిధులుగా లిఖించుకున్నప్పటికి, నేటి యువతకు ఎలాంటి రాజకీయాలు చేయాలో దిశానిర్దేశం చేసిన వారు మాత్రం ఏమాత్రం ఏమాత్రం ఎంత మాత్రం కాదు.ఎందుకంటే ఎంతసేపు ఆధిపత్య సమాజం దగ్గర తలదించి తమ అధికారం కోసం పాకులాడి, కనీసం నా నియోజకవర్గానికి నిధులెందుకు ఇవ్వరని కనీసం పిట్టగొంతుతో కూడా అడగలేని పిరికి నాయకులు, ఆత్మగౌరవాన్ని అడుగడుగునా చంపుకొని చేసిన పార్ట్ టైం రాజకీయ నాయకులు, డుడూ బసవన్నలు వీళ్ళు.ఇలాంటి వారి వల్ల వారికి ఇంటి బిక్షం పొట్ట భత్యం తప్ప సమాజానికి ఎలాంటి ఉపయోగం లేదు.అందుకే రాబోయే అనతి కాలంలో వీళ్ళను చరిత్రతో పాటు యువత కూడా మర్చిపోబోతున్నారు.
ఆధిపత్య కులనాయకుల రాజకీయ ఆటలో చిక్కుకున్న బక్క సైనికులు వీళ్ళు ఎన్నటికున్న వారి వ్యూహంలో బలవ్వక తప్పదు.ఈ నీతి ఇప్పటిది కాదు. స్వాతంత్య్ర పోరాట అనంతరం అధికార ఫలితాలు ఎవరు అనుభవించారు,సరిగ్గా ఒక దశాబ్దం క్రితం జరిగిన తెలంగాణ ఉద్యమ అధికార ఫలాలు ఎవరు అనుభవిస్తున్నారు అనే విషయాలు అర్థమైతే మనం ఎవరి పల్లకిలకు బోయాలమో అర్థమవ్వడానికి అన్నం తిన్నంత సేపు కాదు.
ఇకనైనా స్వలాభాల కోసం పాటు పడుతున్న ఇలాంటి నాయకులు,గాయకులు నేటికైన ఆధిపత్య కుల రాజకీయ నాయకుల పోకడను అర్దం చేసుకొని తమ సొంత సమాజం గురించి ఆలోచిస్తానని యువత కోరుకుంటుంది. రిజర్వేషన్ల ఫలితాలు అనుభవించి ఎమ్మెల్యే ఎంపీలు అయిన నేతలు కూడా ఆ మహానుభావుని ఆలోచన విధానానికి తూట్లు పొడిచే విధంగా సాగిస్తున్న రాజకీయాలలో కొనసాగడం సిగ్గుచేటు.ఇకనైనా మేల్కొని బహుజన జాతి ప్రయోజనాల కోసం గళం విప్పకపోతే రాబోయే తరాలకు మీరొక దిష్టి బొమ్మల్లాగా మిగలటం ఖాయం అని రాజకీయ విశ్లేషకులు సెలవిస్తున్నారు.