ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ

ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ
- గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందుకున్న చిన్నారులకు మంత్రి పొంగులేటి అభినందన
జ్ఞాన తెలంగాణ జూన్ 09, ఖమ్మం జిల్లా బ్యూరో చీఫ్ : ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నటరాజ నృత్య కళానికేతన్ 48 వ వార్షికోత్సవం సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో తమ నృత్య ప్రదర్శనలు చేసిన సందర్భంగా పలువురు చిన్నారులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కింది.
ఈ సందర్భంగా వారిని మంత్రి పొంగులేటి ఆదివారం తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రత్యేకంగా అభినందించారు. మంత్రి మాట్లాడుతూ …
పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రాచీన కళలకు ఆదరణ లభిస్తోంది అని తెలిపారు. ఇతర దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా కూచిపూడి,భరత నాట్యం, కథక్ తదితర కళలలో మంచి ప్రాచుర్యం పొంది జాతీయ, అంతర్ జాతీయ, రాష్ట్ర స్థాయి లో కూడా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు. నటరాజ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు, మాస్టార్ ఎస్. మాధవరావు 48 సంవత్సరాలుగా వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయం అని కొనియాడారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని మాధవరావుకు సూచించారు. .
పోటీ ప్రపంచంలో అత్యంత కీలకంగా ఉన్న భరత నాట్యం, కథక్ తదితర అంశాలపై నేటితరం చిన్నారులు తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నటరాజ నృత్య కళానికేతన్ వ్యవస్థాపకులు ఎస్ మాధవరావు, సీనియర్ జర్నలిస్టు మాధవరావు యెగినాటి తదితరులు పాల్గొన్నారు.