కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం

కేసీఆర్‌ ప్రజాఆశీర్వాద సభ విజయవంతం

  • నాయకులను అభినందించిన గులాబీ దళపతి
  • కేసీఆర్‌ సారే కావాలంటూ నినదించిన సబ్బండ వర్గాలు
  • పార్టీ శ్రేణుల అంచనాలకు మించి తరలివచ్చిన ప్రజానీకం

  • మాజీమంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో ప్రచారంలో ముందున్న అభ్యర్థులుసిద్దిపేట, ఏప్రిల్‌ 17( నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఎటు చూసినా జనమే జనం..కిక్కిరిసిన మైదానం… కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌, మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన సబ్బండ వర్గాల ప్రజలు.. మళ్లీ కేసీఆర్‌ సార్‌ కావాలంటూ నినాదాలు..గులాబీ జెండాలు చేతబూని జై కేసీఆర్‌, జై జై కేసీఆర్‌ అంటూ సభ మారుమోగింది. ఉద్యమాల పురిటిగడ్డలో కేసీఆర్‌ నిర్వహించిన మెదక్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభ క్యాడర్‌లో పుల్‌ జోష్‌ నింపింది. లక్ష మంది వస్తారని అంచనా వేయగా అంతకు మించి జనం తరలివచ్చారు.

సభాస్థలి పక్కన పట్టణాలు, గ్రామాలు కూడా లేవు. అయిన కేసీఆర్‌ స్పీచ్‌ను వినేందుకు ఎండను సైతం లెక్క చేయకుండా జనం భారీగా తరలివచ్చారు. సంగారెడ్డి జిల్లాలోని తాడ్దాన్‌పల్లిలో నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభకు రెండు పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్‌, ఆందోల్‌, జహీరాబాద్‌, నారాయణ్‌ఖేడ్‌ శాసనసభ నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ విధానాలను ఎండగట్టినప్పుడు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఆరు గ్యారెంటీల పేరిటి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీని ఏం చేద్దాం అన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీని బొందపెడదాం అంటూ నినదించారు.

శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్‌ జిల్లా నుంచి 10 శాసనసభ స్థానాలకు 7 చోట్ల విజయాన్ని అందించినందుకు ఇక్కడి ప్రజలకు రుణపడి ఉంటానని కేసీఆర్‌ చెప్పినప్పుడు ప్రజలు జై కేసీఆర్‌ అంటూ నినాదాలు చేస్తూ రెండు పార్లమెంట్‌ స్థానాలు గెలుస్తాం అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత తొలి సభ గ్రాండ్‌ సక్సెస్‌ కావడంతో కార్యకర్తలు ఉత్సాహంగా ఉన్నారు. మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు నేతృత్వంలో నాలుగైదు రోజుల్లోనే సభను విజయవంతం చేశారు. స్థానిక శాసనసభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ముఖ్యనేతలు సమిష్టిగా సభను విజయవంతం చేయడంతో పార్టీ అధినేత కేసీఆర్‌ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే మండలాల వారీగా పార్టీ సమావేశాలను నిర్వహిస్తూ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తున్నారు. పార్టీ క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అందరికీ భరోసా…

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కేసీఆర్‌ అందరికీ భరోసానిచ్చారు. రైతు బంధు, సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండే.. పుల్‌ కరెంట్‌ ఉండడంతో పంటలు పండాయి. రైతుల ముంగిటనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి కొన్నారు. అని సభకు వచ్చిన రైతులు చెప్పారు. కేసీఆర్‌ ఏం చేసాడో మాకు తెలియదు… కానీ అన్ని వర్గాలకూ భరోసానిచ్చారు. ఇవ్వాళ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే కరువు వచ్చింది. పంటలు ఎండిపోయాయి. తాగునీటికి ఇబ్బంది ఏర్పడిందన్నారు.

మాజీమంత్రి హరీశ్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టినప్పుడు ప్రజల నుంచి స్పం దన వచ్చింది. సిద్దిపేట నుంచి ప్రారంభమైన పోస్టుకార్డు ఉద్యమానికి మంచి స్పందన వస్తున్నదని, స్వయంగా కేసీఆర్‌ సభలో చెప్పారు. ప్రభుత్వ హామీలపై గోవిందా..గోవిందా అంటూ దేశపతి శ్రీనివాస్‌ పాడిన పాటకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలకే మాకు ఈ కష్టాలు ఏమిటని ప్రజలు వాపోయారు. మళ్లీ కేసీఆర్‌ సార్‌ వస్తేనే మంచి రోజులు వస్తాయని జనం చర్చించుకున్నారు.

ఫ్రీ బస్సులు కొంప ముంచాయి..

వట్‌పల్లి/మునిపల్లి, ఏప్రిల్‌ 17: కాంగ్రెస్‌ ప్రభుత్వ ఫ్రీ బస్సులు కొంప ముంచాయి… బస్సుల్లో పోదమంటే పనులు ఉన్నవాళ్లు లేనివాళ్లు తిరుగుతుండ్రు.. చదువుకోడానికి మా బిడ్డను కాలేజీకి పంపుదామంటే బస్సుల్లా నిలవడానికి జాగలేదు. ఆటోలో పంపించే స్థోమత లేక కాలేజీ బంద్‌ పెట్టింశా.. బస్సుల్లో మహిళల మధ్య గొడవలు, చోరీలు జరుగుతుండె…బస్సుల్లో ఆడోళ్లకు రక్షణ కరువైంది. ప్రతి మహిళకూ నెలకు రూ.2500 ఇస్తానని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పటిదాకా ఆ ఊసు తీయడం లేదు. అబద్ధపు కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయినం…. మళ్లీ కాంగ్రెస్‌కు ఓటు వేయం.

-పూజల నాగమ్మ, కోహీర్‌

ఆరు గ్యారెంటీలు…పచ్చి అబద్ధాలు

వట్‌పల్లి/మునిపల్లి, ఏప్రిల్‌ 17: కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అబద్ధపు హామీలిచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసింది. బీఆర్‌ఎస్‌ హయాంలో నీటి కష్టాలు, కరెంటు కష్టాలు చూడలేదు… ఇప్పుడు ఆ కష్టాలు చూపించిన కాంగ్రెస్‌ పార్టీని మరువం. అప్పట్లో కాంగ్రెస్‌ అంటేనే కష్టాలు అనేటోళ్లు..ఇప్పడు కనులారా చూస్తున్న..మహిళలకు ఉచిత బస్సులు తప్ప మరేదీ జరగలేదు. అబద్ధాల కాంగ్రెస్‌కు తెలంగాణలో బొందపెట్టాలే…నాలుగు నెలలకే చుక్కలు చూపించింది.

-మెతరి పార్వతి, నిజాంపేట

తప్పుడు మ్యానిఫెస్టోతో ఓట్లు వేయించుకున్నారు..

వట్‌పల్లి/మునిపల్లి, ఏప్రిల్‌ 17: కాంగ్రెసోళ్లు తప్పుడు మ్యానిఫెస్టోతో తెలంగాణ ప్రజలను మోసం చేసిండ్రు.. ఆరు గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ నెరవేర లేదు.. బీఆర్‌ఎస్‌ హయాంలో రైతులకు కష్టాలు తెలియవు. కాంగ్రెస్‌ రాగానే రైతులకు కరెంటు కష్టాలు మళ్లీ తెలియజేసింది. సంక్షేమ పథకాలు ఆపేసి రైతుల నోట్లో మట్టి కొట్టింది. అలాంటి కాంగ్రెస్‌కు ఓటువేసి కష్టాలు తెచ్చకోం. కేసీఆర్‌ ఉన్నప్పుడు కరెంటు, నీటి కష్టాలు కనబడ లేదు. సంక్షేమ పథకాలు సకాలంలో అందాయి. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థికి ఓటువేసీ భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఆరు గ్యారెంటీల కాంగ్రెస్‌ను తరిమికొడతాం.

-శ్రీనివాస్‌రెడ్డి, ర్యాలమడుగు, నిజాంపేట మండలం

కాంగ్రెస్‌వన్నీ.. ఝూటా హామీలు..

వట్‌పల్లి/మునిపల్లి, ఏప్రిల్‌ 17: కాంగ్రెస్‌వన్నీ..ఝూటా హామీలే..ఆరు గ్యారెంటీలని చెప్పి ఓట్లు వేయించుకొని ఫ్రీ బస్సు తప్ప ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. రైతులను నిలువునా ముంచింది. కరెంటు గోస మళ్లీ మొదలైంది. పదేండ్ల కింద తెలంగాణ ఎట్ల ఉండెనో.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే పదేండ్లు వెనక్కి వెళ్లినట్లు అనిపించింది. కేసీఆర్‌ సార్‌కు ఓటు వేయక చాలా తప్పు చేశాం. ఎంపీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెబుతాం.. కాంగ్రెస్‌ అంటేనే మోసం అని.. మరోసారి రుజువు చేసింది.

You may also like...

Translate »