కొత్త రూపును సంతరించుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలు.

కొత్త రూపును సంతరించుకుంటున్న ప్రభుత్వ పాఠశాలలు.
అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలల అభివృద్ది పనులు.
బోధన్ నియోజకవర్గంలో 60-80% పనుల పూర్తి.
జ్ఞాన తెలంగాణ బోధన్
ప్రభుత్వం శిథిలావస్థకు చేరిన పాఠశాలల మరమ్మత్తులకు కార్యాచరణ చేపట్టింది .గత కొన్ని సంవత్సరాలుగా నిరాదరణకు గురైన ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వం అభివృద్ది పనులు చేపట్టడానికి నిధులు మంజూరి చేసింది. పాఠశాలలో నాపరాళ్లు పగిలి అస్తవ్యస్తంగా మారడంతో దాంతో రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పాఠశాలలను గుర్తించి వాటి మరమ్మతులకు కావలసిన నిధులను మంజూరు చేసింది. బోధన్ నియోజకవర్గంలో 146 పాఠశాలలకు ప్రభుత్వం వివిధ అభివృద్ధి పనులు చేపట్టడానికి గుర్తించి నిధులను మంజూరు చేసింది.
బోధన్ మండలంలో 40 పాఠశాలలు, సాలూర మండలంలో 10 పాఠశాలలు, బోధన్ అర్బన్ లో 25 పాఠశాలలు, రెంజల్ మండలంలో 18 పాఠశాలలు, ఎడపల్లిలో 24 పాఠశాలలు, నవీపేట్ లో 39 పాఠశాలలు ఎంపిక చేసి వాటికి అవసరమైన నిధులను మంజూరు చేసింది. మంజూరైన నిధులతో టాయిలెట్స్, తాగునీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, మైనర్ రిపేర్లు, బాలికలు మూత్రశాలలు లాంటివి ఏర్పాటు చేయవలసి ఉంటుంది. బోధన్ మండలంలో నర్సాపూర్, సాలూర మండలంలో తగ్గెల్లి పాఠశాలలు పూర్తిస్థాయిలో పనులు పూర్తయ్యాయి. మరిన్ని పాఠశాలల్లో పనులు 60 నుండి 8వ శాతం వరకు పనులు పూర్తయ్యాయి. ఈసారి విద్యార్థులకు తాగునీటి సౌకర్యం కోసం సరికొత్త రీతిలో వాటర్ ట్యాంకులను ఏర్పాటు చేస్తున్నారు. సిమెంట్ దిమ్మెను నిర్మించి అందులో స్టీల్ వాటర్ ట్యాంకును బిగిస్తున్నారు.
దాంతో భవిష్యత్తులో ట్యాంకులో నాచు ఏర్పడకుండా పిల్లలకు స్వచ్ఛమైన తాగునీరు అందే అవకాశం ఉంటుంది. అలాగే టాయిలెట్స్ నిర్మాణంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు టైల్స్ లాంటివి వేయకుండా ఫ్లోరింగ్ పనులు చేపడుతున్నారు. విద్యార్థులు టైల్స్ పై జారి పడకుండా ఆయన సూచించారు. అలాగే పలుచోట్ల తరగతి గదులలో వరండాలలో నాపరాళ్ళు పగిలిపోయి అస్తవ్యస్తంగా మారాయి. అందులో విషపురుగులు వచ్చి చేరుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న సంఘటనలు వెలుగు చూసాయి. దాంతో నాపరాళ్లను తొలగించి ఫ్లోరింగ్ చేపట్టారు. పలుచోట్ల నాపరాలను తొలగించి కొత్త వాటిని బిగించారు. దాంతో పాఠశాలలో మరమత్తు పనులు పూర్తిగా కావడంతో పాఠశాలలు కొత్త రూపాన్ని సంతరించుకున్నాయి.
అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో…
గతంలో పాఠశాల విద్యా కమిటీ అంటూ ఎస్ఎంసి కమిటీలు ఉండేవి. ప్రస్తుతం ఏర్పడిన నూతన ప్రభుత్వం ఎస్ఎంసి కమిటీలను రద్దుచేసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో పాఠశాలలకు మరమ్మతులు, అభివృద్ధి పనులు చేపట్టడానికి చర్యలు చేపట్టింది. 50వేల బడ్జెట్ వరకు గల పనులను అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో, లక్ష రూపాయల బడ్జెట్ ఆపైన మంజరైన పనులను టెండర్ రూపంలో అప్పగించి చేపడుతున్నారు. దాంతో ప్రస్తుతం బోధన్ నియోజకవర్గంలో ప్రతి పాఠశాలలో మరమతు పనులు జరుగుతున్నాయి. పాఠశాలలో పనులు జరుగుతున్న సందర్భంగా వాటికి కొత్త కళా సంతరించుకుంది. ప్రస్తుతం నూతన ప్రవేశాలు కొనసాగుతున్న సందర్భంగా పాఠశాల అభివృద్ధిని చూసి విద్యార్థులు మరింతగా పెరిగే అవకాశం ఉంది.
త్వరలో మరమత్తు పనులు పూర్తి చేస్తాం
–ఎంఈఓ నాగనాథ్, బోధన్.
బోధన్ ఉమ్మడి మండలంలో చేపడుతున్న పాఠశాలల అభివృద్ధి పనులు, మరవత్తు పనులు లాంటివి ఇప్పటికే 80% శాతం వరకు పూర్తయ్యాయి. మరో నాలుగైదు రోజుల్లో అట్టి పనులను పూర్తి చేయడానికి చర్యలు చేపడుతున్నాం. నూతనంగా పాఠశాలలో చేరే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి అసౌకర్యం కలగకుండా వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో పనులు చేపడుతున్నాం. అవి త్వరగా పూర్తిచేసి విద్యార్థులకు అందుబాటులోకి చేస్తాం.